నిప్పులు చెరిగే ఎండను గుర్తించే ఆవేర్ ప్లాటుఫామ్
ఏపీలో కూటమి ప్రభుత్వం మండించే ఎండల నుంచి ప్రజలను పరిరక్షించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటోంది. ఈ మేరకు ఆవేర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని అందుబాటులోకి తెస్తోంది.
By: Satya P | 15 March 2026 5:00 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వం మండించే ఎండల నుంచి ప్రజలను పరిరక్షించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటోంది. ఈ మేరకు ఆవేర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ని అందుబాటులోకి తెస్తోంది. దీని ద్వారా ఏపీలో ఏ ప్రాంతంలో ఎండలు ఈసారి గట్టిగా మండిస్తాయి అన్నది నాలుగు రోజుల ముందే గుర్తిస్తుంది. ఆ మీదట ఆయా ప్రాంతాల ప్రజలను హెచ్చరించి అప్రమత్తం చేయడమే కాకుండా ప్రభుత్వం తరఫున తగిన విధంగా సహాయం చేయనుంది. వారికి ఉపశమనం కలిగించే విధంగా వేసవి కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది.
అవేర్ ద్వారా హెచ్చరికలు :
ఇదిలా ఉంటే ఆవేర్ ప్లాటుఫామ్ ద్వారా రానున్న 4 నుంచి 5 రోజులలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వేసవి తీవ్రత ఎలా ఉంటుందన్న సమాచారం తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణం కేంద్రాల ద్వారా అందే సమాచారం ఆధారంగా ఏ ప్రాంతాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉఒదో ముందుగానే గుర్తిస్తారు. ఈ సమాచారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు కూడా అందుబాటులో ఉంచుతారు. దీనికి అనుగుణంగా జిల్లా స్థాయిలో వీరంతా చర్యలు తీసుకుంటారు.
డేంజర్...వెరీ డేంజర్ :
ఇక ఏపీలో 27 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఒక ప్రాంతంలో నమోదు జరిగితే దానిని హెచ్చరికగా తెసుకుంటారు అదే 33 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదైతే దానిని అపాయంగా డేంజర్ లో ఉన్నట్లు గుర్తిస్తారు. అదే 42 నుంచి 54 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదైతే దానిని మరింత అపాయంగా వెరీ డేంజర్ గా అవేర్ డిజిటల్ ప్లాట్ ఫాంలో గుర్తిస్తారని అధికారులు చెబుతున్నారు ఇక గతంలో ఉన్న హిస్టారికల్ డేటా ఆధారంగా ఉష్ణోగ్రతల నమోదు ఆధారంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు అవేర్' డిజిటల్ ప్లాటుఫారాన్ని ఉపయోగిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలోని ఏయే జిల్లాల్లో అలాగే ఏఏ మండలాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉందో మ్యాపింగ్ ద్వారా ప్రతీ జిల్లా స్థాయిలోనే తెలుసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఐహెచ్ఐపీ పోర్టల్ ద్వారా రోజూవారీ డేటా సేకరణ నిర్వహిస్తూ రియల్ టైం మానిటరింగ్ ని ఉన్నత స్థాయి నుంచి జిల్లాల స్థాయి దాకా అధికారుల బృందం చేస్తున్నారు.
కేసుల నమోదు ఇలా :
ఇక చూస్తే ఏపీలో ప్రతీ వేసవిలో వడ దెబ్బ కేసులు పెరుగుతున్నాయి. 2024 లో 4,444, 2025 లో 5,154 చొప్పున కేసుల నమోదు జరిగింది. ఇక 2025 లో అత్యధికంగా ఏలూరు జిల్లాలో 1,284, కృష్ణా-1,214, విశాఖ-1,089, కడప-325, పల్నాడు జిల్లాలో 268 చొప్పున వడదెబ్బ కేసుల నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. . వేసవి తీవ్రత రాయలసీమ రీజియన్ తో పాటు, కోస్తాలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాలలోని సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. . 2025 లో కోనసీమలో అత్యధికంగా 47.7 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
