Begin typing your search above and press return to search.

అమరావతిపై తీర్మానం.. రాజకీయ డ్రామానా, అత్యావసరమా? పక్కా విశ్లేషణ

రాజధాని అమరావతికి చట్టబద్దత కోసం ప్రత్యేక తీర్మానం చేయడానికి ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతోంది.

By:  Tupaki Political Desk   |   27 March 2026 5:00 PM IST
అమరావతిపై తీర్మానం.. రాజకీయ డ్రామానా, అత్యావసరమా? పక్కా విశ్లేషణ
X

రాజధాని అమరావతికి చట్టబద్దత కోసం ప్రత్యేక తీర్మానం చేయడానికి ఏపీ అసెంబ్లీ సమావేశం అవుతోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన కొద్దిరోజుల్లో అసెంబ్లీని ఆకస్మికంగా సమావేశపరచడం రాజకీయంగా తీవ్ర చర్చకు కారణమవుతోంది. కేవలం అమరావతిపై తీర్మానం అన్న ఏకైక అజెండాతో సమావేశాన్ని ఏర్పాటు చేయడమే రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశాన్ని ఒక రాజకీయ డ్రామాగా విపక్ష వైసీపీ అభివర్ణిస్తుండగా, భవిష్యత్తులో వైసీపీ కుట్రలు అమరావతిని ఏం చేయలేవని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు ఇప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఎందుకు? ఆ అవసరం ఏంటి? అసెంబ్లీ తీర్మానం లేకుండా కేంద్రం చట్టం చేయలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి సమస్యలు లేకుండా, పార్లమెంటులో చేయబోయే రాజధాని చట్టాన్ని నిర్వచించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వంలో ఎదురైన పరిణామాలతో రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల్లో భవిష్యత్తుపై ఇప్పటికీ భయం ఉందని అంటున్నారు. దీనిని పూర్తిగా తొలగించి, భరోసా ఇవ్వాలనే ఆలోచనే ప్రస్తుత అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. రాజధాని అమరావతి బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, అయితే మరికొన్ని మార్పులు చేయాలని, బిల్లుపై అసెంబ్లీ ద్వారా స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించడంతో మళ్లీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.

ఇదే సమయంలో రాజధాని అమరావతిని నిర్ధారిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయాల్సివుందని చెబుతున్నారు. దీనిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావిస్తూ కొన్ని నిర్ధిష్ట మార్పులు చేయాలని సూచించినట్లు చెబుతున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఇక ఉండకూడదని, రాజధానిగా అమరావతిని అధికారికంగా కేంద్రం ప్రకటించాలని గత కొంతకాలంగా ప్రజలు కోరుతున్నారు. రేపటి సమావేశం తర్వాత జరగబోయే పరిణామాలు ఈ ఆందోళనలకు ముగింపు పలుకుతాయని అంటున్నారు.

నిజానికి 2024 వరకు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం వల్లే ఇన్నాళ్లు అమరావతికి రాజధాని హోదా దక్కలేదని చెబుతున్నారు. అందుకే 2014లోనే విజయవాడ-గుంటూరు నగరాల మధ్య రాజధాని అంటూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా, కేంద్రం అధికారికంగా గుర్తించలేదని అంటున్నారు. ఈ కారణంతోనే వైసీపీ తన పాలనలో మూడు రాజధానులు అన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని అంటున్నారు.

2014లో విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని అన్నారే కానీ, ఎక్కడో స్పష్టంగా తెలియజేయలేదని, గత ఏడాది కేబినెట్ తీర్మానంలో కూడా ఈ అంశంపై స్పష్టత లోపించిందని ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం రాజధాని హద్దులను నిర్దేశిస్తూ లోపాలు లేకుండా తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించినట్లు చెబుతున్నారు. దీంతో సీఆర్డీఏ పరిధిలోని అమరావతి అంటూ స్పష్టం చేస్తూ సీఆర్డీఏ పరిధినే రాజధానిగా నిర్ధారిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావించిందని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో రాజధానిపై గందరగోళం చెలరేగకుండా ఉంటుందని ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లైందని వ్యాఖ్యానిస్తున్నారు.