Begin typing your search above and press return to search.

అమరావతిలో క్వార్టర్స్ కట్టండి... మోడీ

ఈ వ్య‌వ‌హారంతో అమ‌రావ‌తి రాజ‌ధానికి కేంద్రం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంద‌న్న వాద‌నకు మ‌రింత బ‌లం చేకూరింది.

By:  Garuda Media   |   11 Jun 2026 8:00 AM IST
అమరావతిలో క్వార్టర్స్ కట్టండి... మోడీ
X

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు పిల్లిమొగ్గ‌లు వేస్తున్న వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఆలోచించు కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిందా? అమ‌రావ‌తి రాజ‌ధానిని కేంద్రం కూడా ఒప్పేసుకుందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా బుధ‌వారం జరిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో అమ‌రావ‌తిలో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల నివాసాల‌తోపాటు.. కేంద్ర కార్యాల‌యాల ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రి వ‌ర్గం ఆమోదించింది. ఈ స‌మావేశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ఈ ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. దీనికి మంత్రులు ఏక‌గీవ్రంగా ఆమోదించారు.

ఈ వ్య‌వ‌హారంతో అమ‌రావ‌తి రాజ‌ధానికి కేంద్రం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంద‌న్న వాద‌నకు మ‌రింత బ‌లం చేకూరింది. అంతేకాదు.. ఇటీవ‌ల అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ.. కేంద్రం తీర్మానం చేయ‌డం.. దీనిని రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము కూడా ఓకే చేయ‌డం తెలిసిందే. మొత్తంగా.. అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రం ముందు ఎలాంటి త‌ర్జ‌న భ‌ర్జ‌నా లేదు. అంతేకాదు.. ఇప్పుడు అమ‌రావ‌తిలో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో అమ‌రావ‌తికి కేంద్రం ప‌చ్చ‌జెండా ఊపేసింది. అంతేనా.. కేంద్ర స‌హ‌కారంలో ప్ర‌పంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇప్ప‌టికేరుణాలు కూడా ఇస్తున్నాయి.

జ‌గ‌న్ మాటేంటి?

ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ మాటేంటి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. ఇటీవ‌ల కూడా ఆయ‌న వైఖ‌రి మార‌లేదు. కొన్ని రోజుల కింద‌ట అమ‌రావ‌తి రైతులు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంలో కూడా.. జ‌గ‌న్ మావిగ‌న్‌(మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌తో కూడిన రాజ‌ధాని) విష‌యాన్నే ప్ర‌స్తావించారు. తాము వ‌స్తే రైతుల‌కు త‌మ పొలాల‌ను తిరిగి ఇచ్చేస్తామ‌ని కూడా చెప్పారు ఈ ప‌రిణామాల క్ర‌మంలో అటు కేంద్రం ప‌లు సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావ‌డం.. ఇటు రాష్ట్రం వ‌డివ‌డిగా అమ‌రావ‌తి నిర్మాణాల‌ను పూర్తి చేయ‌డం వంటివి జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని పున‌రాలోచించుకునే ప‌రిస్థితిని క‌ల్పిన్తున్నాయి.

మ‌రి ఆయ‌న ఏం చేస్తార‌న్న‌ది చూడాలి. కానీ.. త‌మ నేత అంద‌రి లాంటి వాడు కాద‌ని.. తాను చెప్పింది చేసే ర‌క‌మ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ప్ర‌జ‌ల ఇష్టాలు.. కేంద్రం ఇష్టాల‌కు భిన్నంగా జ‌గ‌న్ అడుగులు వేస్తే.. అది ఆయ‌న‌కు మ‌రింత ఇబ్బందిగా మారుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు., మ‌రి ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.