Begin typing your search above and press return to search.

బస్సు యాక్సిడెంట్లు తగ్గించేందుకు సూపర్ ప్లాన్.. ఇక డ్రైవర్ ను నిత్యం మానిటరింగ్ చేసే మిషన్ రెడీ..

బస్సు డ్రైవర్లకు చిన్న కునుకు వచ్చిందంటే చాలు.. 60 మంది ప్రాణాలు వణకాల్సిందే.. డ్రైవర్ అజాగ్రతతో ఎన్నో్ ప్రమాదాలు జరిగినట్లు చరిత్ర చెప్తోంది.

By:  Satya P   |   1 April 2026 1:20 PM IST
బస్సు యాక్సిడెంట్లు తగ్గించేందుకు సూపర్ ప్లాన్.. ఇక డ్రైవర్ ను నిత్యం మానిటరింగ్ చేసే మిషన్ రెడీ..
X

బస్సు డ్రైవర్లకు చిన్న కునుకు వచ్చిందంటే చాలు.. 60 మంది ప్రాణాలు వణకాల్సిందే.. డ్రైవర్ అజాగ్రతతో ఎన్నో్ ప్రమాదాలు జరిగినట్లు చరిత్ర చెప్తోంది. చాలా మంది ప్రయాణికులు ఈ ప్రమాదాల్లో మరనించారు. రాత్రిపూట ప్రయాణించేటప్పుడు బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకుంటే ఏం జరుగుతుందో అన్న భయం ప్రతి ప్రయాణికుడిలోనూ కలుగుతుంది. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ తీసుకున్న నిర్ణయం పెద్ద ఊరటనిస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత డ్యాష్‌క్యామ్‌లను బస్సుల్లో ఏర్పాటు చేయడం ద్వారా డ్రైవర్ చిన్నగా కునుకు తీసినా లేదంటే ఆవలించినా వెంటనే పసిగట్టి అప్రమత్తం చేసే సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

నిరంతర నిఘా!

బస్సుల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఏఐ కెమెరాలు కేవలం రికార్డింగ్ కోసమే కాదు.., అవి డ్రైవర్ ప్రవర్తనను నిశితంగా గమనిస్తాయి. డ్రైవర్ కళ్లు మూతపడినా.., ఆవలిస్తున్నా.. ఈ కెమెరాలు వెంటనే పసిగడతాయి. ఐదు సెకన్లకు ఒకసారి సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు పంపుతూ, డ్రైవర్‌తో పాటు యజమానిని కూడా అలెర్ట్ చేస్తాయి. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపినా లేదా సిగరెట్ తాగుతున్నా ఈ వ్యవస్థ ఊరుకోదు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తుంది. నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్తే వెంటనే అప్రమత్తం చేయడమే కాకుండా, ఆటోమేటిక్‌గా చలానా కూడా జారీ చేస్తుంది.

ప్రమాదాల విశ్లేషణ

ఈ వ్యవస్థ ద్వారా ప్రమాదం జరిగినప్పుడు బాధ్యులెవరో తేల్చడం సులభం అవుతుంది. బస్సు లోపల డ్రైవర్ వద్ద, ప్రయాణికుల వైపు, డోర్ వద్ద, ముందు రోడ్డు వైపు కెమెరాలు ఉంటాయి. ప్రమాదం సంభవిస్తే రోడ్డు మార్జిన్స్, ముందున్న వాహనాల వివరాలు అన్నీ రికార్డ్ అవుతాయి కాబట్టి, తప్పు ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు, చట్టపరమైన చర్యలు వేగవంతం అవుతాయి.

2 వేల బస్సుల్లో ఏర్పాటు చేయడమే లక్ష్యం!

ఈ అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చును ట్రావెల్స్ యాజమాన్యాలే భరించేందుకు ముందుకు రావడం విశేషం. ఒక్కో బస్సులో ఈ వ్యవస్థ ఏర్పాటుకు రూ. 12,000 అవుతుంది, నెలకు నిర్వహణ ఖర్చు రూ. 750. ఇప్పటికే 391 బస్సుల్లో ఈ డివైజ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే మొత్తం 2 వేల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో దీనిని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఏపీకి తిరిగి రానున్న బస్సులు!

ట్రావెల్స్ బస్సుల రీ-రిజిస్ట్రేషన్ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో సీటుకు త్రైమాసికానికి రూ. 4 వేల పన్ను ఉండడంతో, చాలా మంది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ పన్నును రూ. 2,500 కు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం (ఏప్రిల్ 1) జరిగే సమావేశంలో దీనిపై స్పష్టత వస్తే, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బస్సులు మళ్లీ ఏపీకి వచ్చి రీ-రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుతుంది.

సాంకేతికతను సామాన్యుల భద్రత కోసం వాడుకోవడం అభినందనీయమనే చెప్పాలి. కునుకు తీసినా పట్టేసే ఈ ఏఐ వ్యవస్థ వల్ల డ్రైవర్లలో బాధ్యత పెరగడమే కాకుండా, వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లభిస్తుంది. పన్ను తగ్గింపు ద్వారా యాజమాన్యాలకు ఊరటనిస్తూనే, భద్రతా ప్రమాణాలు పాటించేలా చేయడం రవాణా శాఖ తీసుకున్న ఒక సమతుల్య నిర్ణయం.