'జగన్ వస్తే.. ఇవి ఉండవ్'- టీడీపీ కొత్త ప్రచారం.. !
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన తర్వాత ఏపీలో అనేక మార్పులు వస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.
By: Garuda Media | 15 May 2026 6:00 PM ISTతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన తర్వాత ఏపీలో అనేక మార్పులు వస్తాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా గత ప్రభుత్వాల పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకు మాత్రమే తమిళనాడు అసెంబ్లీలో చోటు దక్కింది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను జగన్ వచ్చిన తర్వాత 2019 -24 మధ్య రద్దు చేశారు. వీటిలో ప్రధానంగా అన్నా క్యాంటీన్, షాదీ ముబారక్ వంటి కీలక పథకాలు ఉన్నాయి.
అదే విధంగా ఉన్నత విద్యను అభ్యసించే వారికి విదేశాలకు వెళ్లే సదుపాయాన్ని కూడా దాదాపు తీసేశారు. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. అదే సమయంలో టిడిపికి అనుకూల ఓటు బ్యాంకు ను పెంచాయి. దీనిని గమనించిన చంద్రబాబు వైసీపీ అమలు చేసిన పథకాలను కొనసాగిస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అలాగే వాటిని కొనసాగిస్తున్నారు. ఉదాహరణకు అమ్మబడి పేరుతో వైసిపి హయంలో అమలు చేసిన పథకాన్ని తల్లికి వందనం పేరుతో మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు.
అదే విధంగా రైతు భరోసా పేరుతో వైసిపి అమలు చేసిన పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో అమలు చేస్తున్నారు. అదే సమయంలో అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచారు. రాష్ట్రవ్యాప్తంగా వీటిని మరింత పెంచాలని కూడా భావిస్తున్నారు. వీటికి తోడు విదేశీ రుణాలు, షాదీ ముబారక్ వంటి పథకాలను కూడా పునరుద్ధరించారు. ఇక ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. టిడిపి అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తారా అంటే తమ విధానాలు తమకు ఉన్నాయని ఇటీవల బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
దీన్ని బట్టి టిడిపి అమలు చేస్తున్న పథకాలు వైసీపీ వస్తే తీసేసే ప్రమాదం ఉందన్నది స్పష్టమవుతుంది. ఇది ఎన్నికల సమయంలో స్పష్టంగా ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు సృష్టించడం ఖాయం అవుతుంది. వీటిని టార్గెట్గా చేసుకుని టిడిపి ఇప్పుడు ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం అమలవుతున్న పథకాలను వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే పూర్తిగా రద్దు చేస్తుందని ప్రధానంగా మహిళలకు ఉచితంగా అమల్లోచేస్తున్న బస్సు ప్రయాణాలు రద్దవుతాయని చెప్పనుంది.
అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను కూడా రద్దు చేస్తారని ప్రచారం చేయాలని టిడిపి నిర్ణయించింది. తద్వారా వైసిపిని అడ్డుకునేందుకు సాధ్యమైనన్ని వ్యూహాలను అమలు చేయాలని టిడిపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. మహానాడు వేదికగా దీనికి సంబంధించి ప్రకటన చేయనున్నారు. ఎలా చూసుకున్నప్పటికీ ప్రజల్లో విస్తృతంగా ఉన్న కొన్ని పథకాల విషయంలో వైసిపి మారకపోతే కష్టం అనే భావన వినిపిస్తోంది.
