Begin typing your search above and press return to search.

జగన్ ఆరాటం...నాయకుల పోరాటం ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే తెగ ఆరాటపడుతున్నారు. ఆయన గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు సర్ ప్రక్రియ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.

By:  Satya P   |   17 Jun 2026 4:00 PM IST
జగన్ ఆరాటం...నాయకుల పోరాటం  ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే తెగ ఆరాటపడుతున్నారు. ఆయన గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు సర్ ప్రక్రియ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. సర్ ద్వారా పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తారు అని అంటున్నారు. నియోజకవర్గానికి అయిదు వేల ఓట్లు అలాగే బూత్ లెవెల్ లో యాభై ఓట్లు వైసీపీని టార్గెట్ చేసుకున్నారు అని కూడా ఆయన అంటున్నారు. ఈ విషయంలో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తి అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరుతున్నారు.

మీదే బాధ్యత అంటూ :

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్లు తమ బాధ్యతగా సర్ ప్రక్రియని మోనిటరింగ్ చేయాలని జగన్ కోరుతున్నారు. లేకపోతే తీవ్ర స్థాయిలో నష్టపోతామని కూడా జగన్ స్పష్టంగా చెబుతున్నారు. తాజాగా జగన్ మరో మారు ఇదే తరహా హెచ్చరికలను పార్టీ నేతలకు జారీ చేశారు. ఒక్క ఓటు సర్ ప్రక్రియలో తొలగించినా తిరిగి ఆ ఓటుని చేర్చడం బహు కష్టమని సీనియర్ నాయకుల భేటీలో జగన్ పేర్కొన్నారు. సర్ ప్రక్రియని అంతా అర్ధం చేసుకోవాలని జగన్ సూచించారు.

నాలుగు వారాలు కీలకం :

ఏపీలో సర్ ప్రక్రియ మొదలైపోయింది. జూన్ 15 నుంచి జూలై 15 వరకూ నెల రోజుల పాటు సర్ ప్రక్రియ సాగుతుంది. ఆ తరువాత ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. అయితే ముసాయిదాలో తప్పు ఒప్పులు చూసుకుని పోయిన ఓట్లను చేర్పించడం కష్టమవుతుందని అంటున్నారు. అది ఒక పెద్ద ప్రహ్సనం. అంతే కాదు అతి పెద్ద తతంగంగా ఉంటుందని అంటున్నారు. అందువల్ల ఈ నాలుగు వారాలే కీలకమని జగన్ పదే పదే చెబుతున్నారు. ప్రతీ ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్ కూడా కష్టపడాలని వారి వెంట నియోజకవర్గం ఇంచార్జి తప్పనిసరిగా ఉండాలని కూడా జగన్ సూచిస్తున్నారు.

బాబుతో జాగ్రత్త

ఇక ఏపీలో చంద్రబాబుతో జాగ్రత్త అని కూడా జగన్ అంటున్నారు. బాబు వ్యూహాలలో ఆరితేరిన వారు అని అందువల్ల వైసీపీ ఓట్లు గల్లంతు కాకుండా కంటికి రెప్పలా కాచుకోవాల్సిన అవసరం ఉందని జగన్ అంటున్నారు. ఇక వైసీపీ ఓట్లను పెద్ద ఎత్తున తీసేయడానికి కూటమి కుట్ర చేస్తోంది అని కూడా జగన్ ఆరోపిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లోకి వైసీపీ యంత్రాంగం మొత్తం దిగితేనే తప్ప సర్ లో వైసీపీ ఓట్ల గల్లంతుని అడ్డుకోలేమని జగన్ గట్టిగా చెబుతున్నారు. నిరంతరం సమీక్షలు కూడా చేయాలని జగన్ కోరుతున్నారు.

సీరియస్ గానేనా :

అయితే జగన్ ఆరాటం చాలానే ఉంది కానీ నాయకుల పోరాటం ఆ లెవెల్ లో ఉందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఓట్లను రక్షించుకోవాలని జగన్ ఎంత చెబుతున్నా గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసరికి ఆ సీరియస్ నెస్ ఎంత అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది. పార్టీలో ఇంకా యాక్టివ్ నెస్ రాకపోవడం ఒక కారణం అయితే ఇంత చేసినా రేపటి ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందా లేదా అన్న డౌట్ కూడా నేతలకు ఉందని అంటున్నారు. మరో వైపు క్యాడర్ లో ఇంకా నిరాశ పోలేదని అంటున్నారు. ఈ రెండేళ్లలో క్యాడర్ ని దగ్గర తీసి కనీసం సమీక్షలు అయినా నిర్వహించకపోవడం వల్లనే ఆ ప్రభావం ఇపుడు పడుతోందా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి చూస్తే అవతల టీడీపీ పూర్తి జోష్ లో ఉంది. ప్రతీ ఓటూ మనదే కావాలని పట్టుదలగా ఉంది. వైసీపీ కూడా పందెం కోడిలా తలపడినపుడే సర్ ప్రక్రియలో ఓట్లు గల్లంతు కావు. మరి రెండు రోజులుగా సర్ సాగుతోంది. వైసీపీ హడావుడి అయితే ఇంకా మొదలు కాలేదనే అంటున్నారు. చూడాలి మరి పార్టీ నేతలు ఏ రకంగా రంగంలోకి దిగుతారో.