జగన్ పాదయాత్రపై మిశ్రమ రియాక్షన్.. నెక్ట్స్ చేంజ్ ఇదే...!
వైసిపి అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి పాదయాత్రను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
By: Garuda Media | 15 May 2026 12:39 PM ISTవైసిపి అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి పాదయాత్రను నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన ప్రజల మధ్య ఉండాలని కూడా భావిస్తున్నారు. తద్వారా ఎన్నికల సెంటిమెంటును తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే, గతంలో కూడా జగన్ పాదయాత్ర చేశారు. అంతకుముందు ఓదార్పు యాత్రల పేరుతో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు.
కాబట్టి పాదయాత్ర జగన్ విషయంలో కామన్ గా మారింది. అయితే, ఇప్పుడు అదే విధంగా పాదయాత్ర చేస్తే ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదని పార్టీ చేపట్టిన అంతర్గత సర్వేలో స్పష్టమైనది. దీనిపై పార్టీ నాయకులు నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మీ మీ ప్రాంతాల్లో పాదయాత్ర చేపడితే వచ్చే ప్రభావం ఎంత, పాదయాత్ర చేస్తే నియోజకవర్గంలో పెరిగే ఓట్లు ఎన్ని అనే అంశాలపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర పై ఇంట్రెస్ట్ లేదని స్పష్టమైనది.
అదే సమయంలో పాదయాత్రను ప్రజలు పెద్దగా సీరియస్గా తీసుకునే విషయంగా కూడా లేదని కొంతమంది నాయకులు తేల్చి చెప్పారు. పాదయాత్ర ఇప్పుడు కామన్ అయిపోయింది కాబట్టి అలా కాకుండా డిఫరెంట్ గా ఏదైనా ప్రజల్లోకి వెళితే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరిగింది. ఈ క్రమంలో పాదయాత్రను కేవలం కొంత దూరాన్ని నడపడం ద్వారా ప్రజలను కలుసుకునే విధానం గా కాకుండా కొంత సమయం తీసుకున్నప్పటికీ మండలాలు, గ్రామీణ స్థాయిలో రచ్చబండల వంటి కార్యక్రమాలు నిర్వహించి సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని అభిప్రాయం పార్టీ వర్గాలనుంచి వినిపించింది.
తద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రహదారి వెంబడి అదేపనిగా నడుచుకుంటూ వెళ్లినా ఉపయోగం లేదని గతంలో జగన్ పాదయాత్ర చేశారని ఆ తర్వాత నారా లోకేష్ కూడా పాదయాత్ర చేశారు కాబట్టి ఇప్పుడు ఈ పాదయాత్ర అంటే ప్రజలు కామన్ విషయంగా భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ పాదయాత్ర విషయంలో ఒక వ్యూహంతో ముందుకు సాగాలనేది వారు చెప్పిన ఆలోచన. ఇప్పుడు ఈ దిశగానే వైసిపి కూడా మార్పులు చేర్పుల దిశగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. పాదయాత్రను సక్సెస్ చేయడంలో జగన్ విఫలమైతే మళ్లీ అధికారంలోకి రావడం అనేది ఇబ్బందికర పరిణామం గానే కనిపిస్తోంది.
