Begin typing your search above and press return to search.

రౌడీ షీటర్లకు వినూత్న రీతిలో కౌన్సిలింగ్.. ఇది వైరల్!

కూటమి ప్రభుత్వంలో పోలీసులు.. నిందితులతో పాటు రౌడీ షీటర్ల విషయంలోనూ సరికొత్త ట్రీట్ మెంట్ తో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   11 Jan 2026 11:34 AM IST
రౌడీ షీటర్లకు వినూత్న  రీతిలో కౌన్సిలింగ్.. ఇది వైరల్!
X

కూటమి ప్రభుత్వంలో పోలీసులు.. నిందితులతో పాటు రౌడీ షీటర్ల విషయంలోనూ సరికొత్త ట్రీట్ మెంట్ తో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. పలువురు నిందితులను చెప్పులు లేకుండా రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. దీంతో.. వారిలో పరివర్తన వస్తుందనేది వారి అభిప్రాయం కావొచ్చు! అయితే.. నిందితుల విషయంలో ఇది కరెక్టా కదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వస్తున్న సంగతి కాసేపు పక్కనపెడితే.. తాజాగా రౌడీ షీటర్లకు ఇదే ట్రీట్ మెంట్ ఇచ్చారు పోలీసులు. దీనిపై మాత్రం ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని తెలుస్తోంది.

అవును... ఏపీలో పోలీసులు తాజాగా రౌడీ షీటర్లకు సరికొత్త ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఇందులో భాగంగా... ఇప్పటికైనా పరువు పోయి, బుద్ది తెచ్చుకుని, బుద్దిగా ఉంటారని నమ్మకమో.. లేక, వారికి ఈ తరహా ట్రీట్ మెంట్ ప్రజల మధ్య వారి భయాన్ని తగ్గిస్తుందనే అభిప్రాయమో తెలియదు కానీ.. పెద్ద సంఖ్యలో రౌడీ షీటర్లను రోడ్డెక్కించారు. సాధారణంగా గతంలో పోలీసు అధికారులు.. రౌడీ షీటర్లను ఓ గ్రౌండ్ లోకి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫుల్ వార్నింగులు ఇచ్చేవారు! అయినప్పటికీ వారిలోని చాలామందిలో మార్పు రావడం లేదని అంటున్నారు.

తాము వారికి ఉన్న కాస్త పరువు గురించి ఆలోచిస్తుంటే.. రౌడీ షీటర్లు మాత్రం.. ఇది పోలీసుల నుంచి రెగ్యులర్ గా వచ్చే కౌన్సిలింగే కదా అని లైట్ తీసుకుని.. వారి రెగ్యులర్ పంథాలోనే చాలామంది కొనసాగుతున్నారనే అభిప్రాయమూ పోలీసుల్లో ఉందని మరికొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లకు గుంటూరు పోలీసులు వినూత్న రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో.. వారికి ఈ ట్రీట్ మెంట్ కరెక్టే అనే కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!

గుంటూరు జిల్లాలో తరచూ నేరాలకు పాల్పడుతుండడం, రౌడీయిజం చేస్తున్న సుమారు వందమందిని పోలీసు డార్మెటరీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం.. వారందరినీ పోలీసు వాహనంలో నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం కూడలికి తీసుకొచ్చి.. అక్కడి నుంచి కాళ్లకు చెప్పుల్లేకుండా నడిరోడ్డుపై సుమారు కిలోమీటరు మేర నడిపించారు. అనంతరం సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు తరలించి, సంతకాలు తీసుకుని మంచిమార్గంలో నడవాలని సూచించి పంపించారు.