లోకేష్ కే ప్రత్యేకం : అందలం అందుబాటులో ఉన్నా !
రాజకీయాల్లో ఒక మాట ఉంటుంది. చాన్స్ రావాలే కానీ వెంటనే దాన్ని అంది పుచ్చుకోవాలని. లేకపోతే దశాబ్దాలు గడచినా వాటి కోసం వెయిట్ చేయాల్సిందే.
By: Tupaki Desk | 17 Jun 2025 3:58 AMరాజకీయాల్లో ఒక మాట ఉంటుంది. చాన్స్ రావాలే కానీ వెంటనే దాన్ని అంది పుచ్చుకోవాలని. లేకపోతే దశాబ్దాలు గడచినా వాటి కోసం వెయిట్ చేయాల్సిందే. దీనికి ఎన్నెన్నో ఉదాహరణలున్నాయి. వైఎస్సార్ కేవలం ముప్పై అయిదేళ్ళ వయసులో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ కి చీఫ్ అయ్యారు. ఆ రోజుల్లో ఆ పదవి అంటే సీఎం సీటుతో సమానమైన పోటీ ఉండేది. కానీ యంగ్ బ్లడ్ ని ప్రోత్సహించాలన్న అనాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆలోచనల మేరకు వైఎస్సార్ కి ఆ చాన్స్ అనూహ్యంగా దక్కింది.
మరి ఆ తరువాత స్టెప్ అయిన సీఎం సీటు మాత్రం అందుకోవడానికి ఆయన మరో ముప్పయ్యేళ్ళు వేచి చూడాల్సి వచ్చింది. ఇక వీ హనుమంతరావుని కూడా రాజీవ్ ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన కూడా పీసీసీ చీఫ్ అయ్యారు. రాజీవ్ 1991లో మరణించి ఉండకపోతే ఆయన సీఎం గా అయి ఉండేవారు. ఇదే మాట ఆయన కూడా చెప్పుకున్నారు. ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో కధలు ఉన్నాయి.
అలాగే వారసుల విషయంలో ఆలస్యం దక్కదు అందలం అన్నది ఒక రాహుల్ గాంధీ కేటీఆర్ ల విషయంలో రుజువు అయింది అని కూడా చెబుతారు. అయితే వారికి ఉన్న ఇబ్బందులు సమస్యలు అయితే తెలుగుదేశం పార్టీ వారసుడు నారా లోకేష్ కి లేవు. ఆయన ఏకైక రాజకీయ వారసుడిగా టీడీపీలో ఉన్నారు. టీడీపీకి చూస్తే ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక మెజారిటీతో సీట్లు దక్కాయి. కూటమిగా పోటీ చేసినా సింగిల్ గా చూస్తే టీడీపీకి 135 దాకా సీట్లు ఉన్నాయి.
లోకేష్ ని ఏపీకి సీఎం గా నిర్భయంగా ప్రకటించవచ్చు. పైగా లోకేష్ రాజకీయంగా తనను తాను నిరూపించుకున్నారు. ఆయన మంత్రిగా కూడా అనుభవం సంపాదించారు. గతంలో రెండేళ్ళ పాటు మినిస్టర్ గా చేసిన లోకేష్ ఈసారి మరిన్ని కీలక శాఖలతో తన పనితీరుని చాటుకుంటున్నారు. మరి ఇదే కదా సరైన తరుణం అని అంతా అంటున్నారు.
ఇక ఏపీకి వచ్చి ఒక మీటింగ్ పెట్టిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే మాట అన్నారు. బాబు నాలుగు సార్లు సీఎం అయ్యారు. ఇక చాలు లోకేష్ కి బాధ్యతలు అప్పగించండి అన్నారు. నిజమే బాబు ఎన్ని సార్లు సీఎం గా ఉన్నా అది ఒక నంబర్ మాత్రమే. అదే తన కుమారుడికి సీటు ఇస్తే లోకేష్ కి అది అద్భుతమైన కెరీర్ అవుతుంది. మరింత కాలం ఆయన రాజకీయంగా రాణించేందుకు గొప్ప సోపానం అవుతుంది.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. లోకేష్ కి అందలం అందుబాటులో ఉంది అన్నది నిజం. మరి అది అందుకునే వీలుందా అన్నదే ఇక్కడ ఒక చర్చగా ఉంది కూటమితో పని లేకుండా కుమారుడికి పట్టాభిషేకం చేయవచ్చు. కానీ అది తాత్కాలికంగా పైచేయి సాధించినట్లుగా ఉన్నా సుదీర్ఘ కాలంలో టీడీపీకి మేలు చేసేదిగా ఉండదని అంటున్నారు.
మరో ఎన్నిక గెలవాలి. వైసీపీ 2029లో కూడా పోటీ ఇస్తుంది. ఈసారి ఓడినా కేవలం 11 సీట్లే వచ్చినా కూడా 40 శాతం ఓటు షేర్ ఆ పార్టీకి ఉంది. దాంతో 2024 ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. ఫైనల్స్ 2029 అన్నది చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఆయనే కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. లోకేష్ ని సీఎం చేయాలని ఆయనకు ఉండదా కానీ రాజకీయంగానే సమీకరణలు సరిపోకనే అలా ఉన్నారని అంటున్నారు.
అంతే కాదు రాష్ట్రం విషయం తీసుకున్నా ఒక గాడిన పెట్టాలి అంటే దానికి బాబు శక్తి అనుభవం కావాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏపీ అప్పుల కుప్పగా ఉంది. అంతే కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. సంక్షేమం ఆపకూడదు, ఇలా ఎన్నో ఉన్నాయి. అందుకే బాబుకు ఇది సంక్షోభాన్ని సవాల్ గా తీసుకున్న సమయం. ఈ పదవి ఆయనకు ఒక విధంగా ముళ్ళ కిరీటం.
అదే పదవిని లోకేష్ కి అప్పగిస్తే మొదటి సారి సీఎం గా ఆయన ఇబ్బందులు పడతారు అని కూడా ఉంది. సక్సెస్ ఫుల్ సీఎం గా లోకేష్ పేరు తెచ్చుకోవాలీ అంటే ఏపీని ఒక గాడిన పెట్టాలి. ఇలా బాబు బహుముఖంగా ఆలోచించబట్టే లోకేష్ కి సీఎం పదవి అందుబాటులో ఉన్నా అందనిది అవుతోంది అని అంటున్నారు.