రాయలసీమలో మూడు కార్పొరేషన్లు.. వైసీపీలో కొత్త ఆశలు
స్థానిక ఎన్నికలపై వైసీపీలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రత్యక్ష విధానంలో మేయర్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు అనుకూలిస్తుందని వైసీపీ సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 12 Oct 2026 7:56 PM ISTస్థానిక ఎన్నికలపై వైసీపీలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రత్యక్ష విధానంలో మేయర్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు అనుకూలిస్తుందని వైసీపీ సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని వైసీపీ పునాదులు బలంగా ఉన్న నగరాలు, పట్టణాల్లో తమ సత్తా చాటుతామని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుతో 2024 అసెంబ్లీ ఎన్నికల ఓటమిని అధిగమించాలని భావిస్తోంది. దీంతో అంతర్గతంగా పెద్ద కసరత్తే చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా గెలుపు అవకాశాలను విశ్లేషిస్తూ కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తోంది.
రాష్ట్రంలో 17 కార్పొరేషన్లు ఉండగా, రాయలసీమలోని 3 కార్పొరేషన్లపై వైసీపీలో పూర్తిస్థాయిలో ధీమా వ్యక్తమవుతోందని చెబుతున్నారు. దాదాపు ప్రతి చోటా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆ మూడు చోట్ల అధికార కూటమి కంటే తాము మెరుగ్గా ఉన్నామని వైసీపీ నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలోని మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాయలసీమలోని మూడు కార్పొరేషన్లు, పలు మున్సిపాలిటీలపై వైసీపీలో కనిపిస్తున్న ధీమా రాజకీయంగా ఆసక్తి రేపుతోందని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత ఇలాకా అయిన కడప నగరపాలక సంస్థతోపాటు పక్కనే ఉన్న కర్నూలు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లను సునాయాశంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ మూడు చోట్ల ఎమ్మెల్యేల పనితీరు, కూటమిలో అంతర్గత కలహాలు తమకు మేలు చేస్తాయని భావిస్తున్నారు.
కడపలో స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డిని టీడీపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారని, పైగా ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు తమకు కలిసి వస్తాయని ఊహిస్తున్నారు. ఇక కర్నూలు, తిరుపతిలో బలమైన కేడర్ సహకారంతో ఈజీగా గట్టెక్కుతామని వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారని చెబుతున్నారు. కర్నూలులో కూడా మైనార్టీ ఓట్లు భారీగా ఉండటంపై వైసీపీ నేతలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. వీటికి తోడు తమకు సంస్థాగతంగా ఉన్న బలం కూడా తమకు గెలుపు అవకాశాలను మెరుగు పరిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా కర్నూలు నగరం పరిధిలో ఉన్న కొడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం కూడా కలిసివస్తుందని అంటున్నారు.
మరోవైపు తిరుపతి విషయంలోనూ వైసీపీలో ధీమా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భూమన వంటి బలమైన నేత తమకు అడ్వాంటేజ్ అవుతారని వైసీపీ భావిస్తోంది. భూమన స్థాయి నేత కూటమిలో లేకపోవడం కూడా తమకు కలిసివస్తుందని అంటున్నారు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే స్థానికేతరుడు కావడం, టీడీపీకి గత రెండేళ్లుగా ఇంచార్జి లేకపోవడం వల్ల వైసీపీ దూకుడు ఎక్కువగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇవన్నీ వైసీపీ కలలు కంటోందని రాష్ట్రంలో తమ బలం మరింత పెరిగిందని కూటమి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాయలసీమలోని మూడు కార్పొరేషన్లపై వైసీపీ చూపిస్తున్న ఉత్సాహం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
