ఆ 29 పేర్లలో నెక్ట్స్ ఎవరు? లిక్కర్ స్కాంలో ఇక అరెస్టుల పర్వం!
ఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి అరెస్టు తీవ్ర సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 23 April 2025 10:01 AM ISTఏపీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి అరెస్టు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో సుమారు 9 నెలలుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. అరెస్టుల పర్వానికి తెరలేపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కీలక పత్రాలు మాయం చేస్తున్న కారును పట్టుకున్న పోలీసులు.. అప్పట్లో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాసుదేవరెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో సోదాలు జరిపిన పోలీసులు లిక్కర్ స్కాంపై కేసు నమోదు చేశారు. నాటి నుంచి దర్యాప్తు జరిపిన పోలీసులు తాజాగా విచారణ పేరుతో వైసీపీ కీలక నేతలతోపాటు అనుమానితులను ప్రశ్నించారు. ఇక విచారణ పూర్తవ్వగానే ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేశారు. దీంతో నిందితులుగా పేర్కొన్న వారిలో తర్వాత ఎవరిని అరెస్టు చేస్తారనే చర్చ మొదలైంది.
లిక్కర్ స్కాంలో ముందుగా బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని ప్రశ్నించడంతో విచారణ మొదలైంది. పలుమార్లు వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయనను ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఆ తర్వాత ఇదే స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బెవరేజెస్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ ను ప్రశ్నించారు. అలా కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని పిలిపించి విచారణ జరిపారు. ఈ క్రమంలో రాజ్ కసిరెడ్డి అరెస్టు వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. సాక్షిగా రమ్మంటూ నాలుగుసార్లు రాజ్ కసిరెడ్డికి నోటీసులిచ్చినా, ఆయన రాకపోవడంతో హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని ఆ తర్వాత అరెస్టు చేశారు. ఇక ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించారు. ఈ ఇద్దరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చడంతో వారినీ అరెస్టు చేసే అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లిక్కర్ స్కాంలో ఏ4గా పేర్కొన్న ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్టు నుంచి రక్షణ తెచ్చుకున్నారు. అయితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో మిథున్ రెడ్డికి కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని, ఆయనను నిందితుడిగా చేర్చలేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో తదుపరి చర్యలు తీసుకునే వరకు అరెస్టు చేయొద్దంటూ కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని నిందితుడిగా తేల్చడంతో అరెస్టు చేస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది. మరోవైపు స్కాంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానంటూ అడగకపోయినా ఆఫర్ చేసిన విజయసాయిరెడ్డి పేరు కూడా నిందితుల జాబితాలో ఉంది. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే కేసులో తాను అప్రూవర్ అయినట్లు స్వయంగా విజయసాయిరెడ్డి ప్రకటించుకోవడం వల్ల ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చేలా ప్రభుత్వం సహకరిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
దీంతో రాజ్ కేసిరెడ్డి తర్వాత అరెస్టు ఎవరన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ స్కాంలో ఎక్కువగా రాజ్ కసిరెడ్డి బంధువులు, స్నేహితుల పేర్లు కూడా నిందితులుగా చేర్చారు. వీరంతా ఓ నెట్ వర్కుగా ఏర్పడి మద్యం కమీషన్ల దందా నడిపినట్లు సిట్ ఆరోపిస్తోంది. దీంతో రాజ్ కసిరెడ్డి తోబుట్టువు ముప్పిడి అవినాశ్ రెడ్డి, బూనేటి చాణక్య, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్ వంటివారిని నెక్ట్స్ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీరంతా రాజకీయాలకు సంబంధం లేని వారు కావడం, వీరి అరెస్టు వల్ల కేసు దర్యాప్తులో మరింత పురోగతి సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. అదే సమయంలో వీరి అరెస్టుతో కేసును ఓ కొలిక్కి తెచ్చే అవకాశం ఉందంటున్నారు.
