Begin typing your search above and press return to search.

జగన్ కు రక్షణ.. అరెస్టు అంత ఈజీ కాదన్న టాక్!

ఏపీలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాదిగా మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పాత్రధారులను అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   28 July 2025 8:30 AM IST
జగన్ కు రక్షణ.. అరెస్టు అంత ఈజీ కాదన్న టాక్!
X

ఏపీలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణంలో కీలక అరెస్టులపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాదిగా మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పాత్రధారులను అరెస్టు చేశారు. మొత్తం 40 మంది నిందితులుగా గుర్తించి అందులో 12 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వైసీపీ ముఖ్య నేతలు ఉండటంతో ఈ స్కాం రాజకీయ ప్రాధాన్యతాంశంగా మారింది. ముఖ్యంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత పరిణామాలు వేగంగా మారినట్లు చెబుతున్నారు. మిథున్ రెడ్డి తర్వాత కీలక అరెస్టు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరగడం, ప్రభుత్వం కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపించిందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ జోరుకు తాజాగా కళ్లెం పడిందనే సమాచారం రాజకీయంగా వేడిపుట్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో కీలక అరెస్టుకు అడుగులు పడే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు.

నెక్ట్స్ ఎవరు?

మద్యం స్కాంలో మొత్తం 40 మంది నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నిందితుల్లో వైసీపీకి చెందిన కీలక నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రముఖులు. ఈ ఇద్దరిలో మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు కాగా, భాస్కరరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా వీరిద్దరూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి కుడి ఎడమ భుజాలుగా చెబుతారు. దీంతో సిట్ నెక్ట్స్ స్టెప్ మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అంటూ ప్రచారం జరిగింది. స్కాంలో అంతిమ లబ్దిదారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని నిర్ధారిస్తూ సిట్ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది. దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందన్న సమాచారం కలకలం రేపింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి అరెస్టుకు ప్రభుత్వం సాహసిస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఆయనకు ఉన్న జన బలమే అన్న వాదన ఉంది. ఎన్నికల్లో ఓడినప్పటికీ జగన్ కు 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్న విషయాన్ని గమనించి, ఆయన అరెస్టుపై ప్రభుత్వం ఒకటి పది సార్లు ఆలోచన చేస్తోందని అంటున్నారు.

అరెస్టుతో సానుభూతి వస్తుందా?

ఏపీలో ఎన్నికలు జరిగి దాదాపు 14 నెలలు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నుంచి అరెస్టులతో ప్రతిపక్షాన్ని గడగడ లాడిస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన అరెస్టులు అన్నీ చిన్నచిన్న చేపలుగానే భావిస్తున్నారు. అరెస్టుల పరంపరలో జగన్ ను టచ్ చేస్తే పెను తుఫానును తట్టి లేపినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జగన్ ను అరెస్టు చేయడం ద్వారా ఆయనపై ప్రజల్లో సానుభూతి కల్పించినట్లు అవుతుందన్న చర్చ పాలక పక్షంలో జరుగుతోందని అంటున్నారు. స్కాంలో జగన్ ను అరెస్టు చేస్తే, లిక్కర్ వ్యవహారంలో అవినీతితో ప్రభుత్వ కక్ష సాధింపుపైనా చర్చ జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోనే ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందా? లేదా? వస్తే దాన్ని అధిగమించడం ఎలా అన్న అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ వచ్చాకే జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

రంగంలోకి కేంద్ర పెద్దలు

మరోవైపు జగన్ అరెస్టుపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకోకుండా కేంద్ర పెద్దలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.బీజేపీ తన భవిష్యత్తు రాజకీయ వ్యూహంలో భాగంగా వైసీపీని దూరం చేసుకునే ఆలోచనలో లేదని, అందుకే జగన్ అరెస్టుకు అడ్డు పడుతోందన్న చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కేంద్రంలో టీడీపీపై ఆధారపడి ఉన్నప్పటికీ జగన్ అరెస్టు విషయంలో తుది నిర్ణయం తీసుకునే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని అంటున్నారు. గతంలో వైసీపీ తమ పార్టీకి సహకరించిన విషయంతోపాటు రానున్న రోజుల్లోనూ వైసీపీ రాజ్యసభ సభ్యులు అవసరం పడొచ్చన్న కారణంగా తమ అనుమతి లేకుండా జగన్ అరెస్టుపై నిర్ణయం తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ అరెస్టు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.