ఆ రెండు 'ఓపెనింగు' లపై సెటైర్లు.. ఏం జరిగింది ..!
రాష్ట్రంలో కూటమి పార్టీల నాయకులపై సోషల్ మీడియాలో సెటైర్లు రావడం సహజంగా మారింది. అయితే.. గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు.. దూషణలతో ట్రోల్స్ వస్తే.. ఇప్పుడు కొంత మేరకు అది తగ్గుముఖం పట్టింది.
By: Tupaki Desk | 10 Jun 2025 9:45 AM ISTరాష్ట్రంలో కూటమి పార్టీల నాయకులపై సోషల్ మీడియాలో సెటైర్లు రావడం సహజంగా మారింది. అయితే.. గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు.. దూషణలతో ట్రోల్స్ వస్తే.. ఇప్పుడు కొంత మేరకు అది తగ్గుముఖం పట్టింది. అయినా.. నాయకులు చేస్తున్న పనులు కూడా కొంత మేరకు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. దీంతో ట్రోల్స్ చేసేవారు చేస్తూనే ఉన్నారు. వారు ట్రోల్స్ చేశారని బాధపడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే.. వారు చేస్తున్న పనులు కూడా అలానే ఉన్నాయి. దీంతో నాయకులపై సెటైర్లు కామెంట్లు ఆగడం లేదు.
రెండు రోజుల కిందట జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ సెలూన్ దుకాణాన్ని ప్రారంభించారు. అయితే.. ఇది ప్రైవేటు కార్యక్రమమని ఆయన కార్యాలయం ప్రకటించింది. కానీ, ఈ కార్యక్రమంలో ఎస్పీ స్థాయి అధికారి పాల్గొన్నారు. అదేవిధంగా దిగువస్థాయి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనిపై ట్రోల్స్ వచ్చాయి. డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు సెలూన్‌ను ప్రారంభించడం ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ వ్యవహారంపై జనసేన కానీ.. అధికార పార్టీ నాయకులు కానీ.. మౌనంగా ఉన్నారు.
ఇక, ఇదే కార్యక్రమంలో పవన్ వేసుకున్న డ్రెస్‌పైనా నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు షార్ట్ వేసుకుని వచ్చారు. సాధారణంగా లాల్చీ ఫైజమా లేదా.. ఇతర దుస్తుల్లో ఉండే పవన్ కల్యాణ్.. సెలూన్ కార్యక్రమానికి మాత్రం షార్ట్‌పై వచ్చారు. దీనిపైనా ట్రోల్స్ వచ్చాయి. అయితే.. పవన్ దీనిని లైట్ తీసుకున్నారు. కానీ, నెటిజన్లు మాత్రం ఇప్పటికీ సెటైర్లు వేస్తున్నారు. ఇక, టీడీపీ ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన పని కూడా విమర్శలకు తావిచ్చింది. ఆయన కూడా ఇలాంటి కార్యక్రమానికే హాజరయ్యారు.
నెల్లూరులో కొత్తగా ఏర్పాటు చేసిన నైటీల షాప్(మహిళలు ధరించేవి)ను రెండు రోజుల కిందట కోటంరెడ్డి అట్టహాసంగా ప్రారంభిం చారు. దీనిపైనా నెటిజన్లు ట్రోల్స్ చేశారు. వైసీపీ శ్రేణులు దీనిపై విమర్శలు గుప్పించారు. ఓ మహిళ ఏర్పాటు చేసుకున్న నైటీల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. అయితే.. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఏంటన్నది నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్న.. దీనిపై కోటంరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒక నిరుపేద సోదరి, తన రెక్కల కష్టంతో జీవనోపాధి కోసం నెలకొల్పిన ఒక చిన్న వస్త్రాల దుకాణం ప్రారంభోత్సవానికి, స్థానిక కమ్యూనిస్టు నాయకుల ఆహ్వానంపై తాను వెళ్లినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తన ఆశయాన్ని నిలబెట్టేందుకు ఒక ప్రజాప్రతినిధిగా హాజరైన సందర్భాన్ని అపహాస్యం చేయడం సరికాదన్నారు. అయినా.. నెటిజన్లు మాత్రం ఈ ఘటనను కూడా విమర్శిస్తుండడం గమనార్హం.
ఒక నిరుపేద సోదరి, తన రెక్కల కష్టంతో జీవనోపాధి కోసం నెలకొల్పిన ఒక చిన్న వస్త్రాల దుకాణం ప్రారంభోత్సవానికి, స్థానిక కమ్యూనిస్టు నాయకుల ఆహ్వానంపై నేను, తన ఆశయాన్ని నిలబెట్టేందుకు ఒక ప్రజాప్రతినిధిగా హాజరైన సందర్భాన్ని మీరు అపహాస్యం చేయడం, మీ అవగాహన స్థాయి ప్రతిబింబంగా భావిస్తున్నాను