Begin typing your search above and press return to search.

చుక్క కల్తీ జరిగినా పట్టేస్తారు! టీటీడీ ఫుడ్ ల్యాబ్ కు అత్యాధునిక పరికరాలు

తిరుమల క్షేత్రంలో కల్తీకి అస్కారం లేని విధమైన చర్యలకు ప్రభుత్వం నడుంబిగించింది. అత్యాధునిక యంత్రాలతో తిరుమలలో ఫుడ్ లేబ్ ఏర్పాటు చేస్తోంది.

By:  Tupaki Political Desk   |   22 Feb 2026 10:00 PM IST
చుక్క కల్తీ జరిగినా పట్టేస్తారు! టీటీడీ ఫుడ్ ల్యాబ్ కు అత్యాధునిక పరికరాలు
X

తిరుమల క్షేత్రంలో కల్తీకి అస్కారం లేని విధమైన చర్యలకు ప్రభుత్వం నడుంబిగించింది. అత్యాధునిక యంత్రాలతో తిరుమలలో ఫుడ్ లేబ్ ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలోనే ఈ ల్యాబ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రసాదాలు, టీటీడీలో పెట్టే ఇతర ఆహార పదార్థాల్లో సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగిన కనిపెట్టేలా ల్యాబ్ ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాధ్యత తీసుకున్నాయని అంటున్నారు. ప్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్న అత్యాధునిక పరికరాలతో తిరుమలలో ప్రసాదాలను పరీక్షించనున్నారు. ఈ ల్యాబ్ ద్వారా భవిష్యత్తులో తిరుమలలో కల్తీ అన్న ప్రశ్నే తలెత్తదని వ్యాఖ్యానిస్తున్నారు.

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలు, ఆహారం అందించేందుకు వీలుగా ఈ ల్యాబ్ లో అత్యాధునిక పరికరాలను సిద్ధం చేస్తున్నారు. రూ.25 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్లో స్వామి వారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి ఆరవై రకాల ముడిసరకులు, ప్రసాదాల నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షిస్తారు. ప్రస్తుతం ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు పనులు 90శాతం వరకు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసి వచ్చేనెలలో ల్యాబ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెబుతున్నారు.

కల్తీని నెయ్యిని దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాబ్ లో ప్రత్యేకంగా ఈ-టంగ్ అండ్ ఈ- నోస్ (ఎలక్ట్రానిక్ నోరు- ఎలక్ట్రానిక్ ముక్కు) మిషన్లను రూ.3.5 కోట్ల వ్యయంతో సమకూర్చుతున్నారు. నెయ్యి నాణ్యతలో అత్యంత సూక్ష్మస్థాయిలో లోపం ఉన్నా ఈ-టంగ్ అండ్ ఈ-నోస్ యంత్రాలు పసిగడతాయని చెబుతున్నారు. ఇవి అందుబాటులోకి తెచ్చేందుకు మే నెల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుపై బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ల్యాబ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో సత్యకుమార్ కు ఉన్న పరిచయాలతో కేంద్రంలో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరిపారని ఆయన కార్యాలయం వెల్లడించింది. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తిరుమలలో ల్యాబ్ ఏర్పాటుకు రూ.23 కోట్లను మంజూరుచేసింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ మధ్య 2024 అక్టోబరులో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తిరుమల పిండిమిల్లు ఆవరణలో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పాత రెండు అంతస్తుల భవనాన్ని ఫుడ్ ల్యాబ్ కోసం కేటాయించారు.

తిరుమల ల్యాబ్లో మైక్రో బయాలజీ, కెమిస్త్రీ, సెన్సరీ విభాగాల్లో నమూన పరీక్షలు జరగనున్నాయి. ప్రసాదాలు, ఆహార పదారాలు, నీరు, ముడిసరకుల నాణ్యతను పరీక్షిస్తారు. ప్రసాదాలు, వాటికి వినియోగించే ముడిసరకుల్లో పురుగు మందుల అవశేషాలు, భార లోహాలు, క్రిమి కీటకాలు, యాంటీ బయాటిక్స్ వంటి వాటి నమూనాలను ఈ ల్యాబులో పరీక్షిస్తారు. ఆహార పదార్థాలు, ప్రసాదాల్లో 200 రకాల పురుగు మందుల అవశేషాలు గుర్తించే సామర్థ్యం కలిగిన యంత్రాలు ఈ ల్యాబ్ ద్వారా అందుబాటులోనికి వస్తున్నాయి. ఈ ల్యాబ్లో తితిదే జలప్రసాదాల నమూనాలను కూడా పరీక్షిస్తారు. వీటి అన్నింటి కోసం మొత్తం 50 రకాల యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాబ్ నిర్వహణ కోసం వివిధ హోదాల్లో కలిపి 40 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ, తితిదే సంయుక్తంగా నియమించనున్నాయి.

ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్ అండ్ ఈ-నోస్ యంత్రాలు!

ఫ్రాన్స్ లో తయారయ్యే ఈ-టంగ్ అండ్ ఈ-నోస్ యంత్రాలను తిరుమల ఫుడ్ ల్యాబ్ కు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఇవి అందుబాటులో ఉన్న ల్యాబులు దేశ వ్యాప్తంగా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. మనిషి ముక్కు ద్వారా వాసన, నోటి ద్వారా రుచి ఎలా చూస్తారో ఈ యంత్రాల ద్వారా ప్రసాదాలు, ఆహార పదార్థాలు, వాటి తయారీకి వినియోగించే ముడి సరకులను పరీక్షిస్తారు. తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనను దృష్టిలో ఉంచుకుని మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ మిషన్ కొనుగోలుకు అవసరమైన రూ.3.5 కోట్లను అదనంగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాల వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు కూడా ప్రాన్స్ నుంచి వస్తాయి.