ఉద్యోగుల వ్యవహారంపై 'కూటమి' తడబాటు ..!
వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వాలకు.. నాయకులకు వారు అండగా ఉంటున్నారు. ఈ దఫా 2024లోనూ ఇదే జరిగింది. జగన్‌ను కాదని.. కూటమిని నమ్ముకున్నారు
By: Tupaki Desk | 11 Jun 2025 3:00 AM ISTరాష్ట్రంలో ప్రభుత్వాలను శాసిస్తున్న కీలక వర్గాల్లో ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నాడు జగన్ ప్రభుత్వం ఏర్పడినా.. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినా.. 2014లో జగన్‌ను కాదని.. చంద్రబాబుకు అధికారం అప్పగించినా.. ఉద్యోగుల పాత్ర కీలకమేనని చెప్పాలి. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వాలకు.. నాయకులకు వారు అండగా ఉంటున్నారు. ఈ దఫా 2024లోనూ ఇదే జరిగింది. జగన్‌ను కాదని.. కూటమిని నమ్ముకున్నారు.
దీనికి కూడా ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
1) పవన్ చెప్పిన సీపీఎస్ వ్యవహారంపై ఏడాదిలోగా సానుకూల నిర్ణయం.
2) తమకు రావాల్సిన పీఆర్సీ.. డీఏ బకాయిలు తేల్చేస్తామని ఇచ్చిన హామీ. ఈ క్రమంలో ఈ రెండు ప్రధాన హామీలపై వారు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఈ విషయంలో కూటమి సర్కారు ఏడాది పాలనలో చేసింది ఏమైనా ఉందంటే.. జగన్ తీసుకున్న నిర్ణయాలను బుట్టదాఖలు చేయడం. తద్వారా.. తాము మెరుగైన విధానాలు తీసుకువస్తామని చెప్పడం.
ఈ క్రమంలోనే జగన్ హయాంలో వేసిన పీఆర్సీ కమిషన్‌ను రద్దు చేసింది. కానీ.. ఇది రద్దు చేయడంతో ఉద్యోగుల్లో మరో ఆశ నెలకొంది. సహజంగానే పీఆర్సీ రద్దు చేస్తే.. ఇంటీరియం రిలీఫ్(మధ్యంతర భృతి-ఐఆర్) ఇస్తారనేది అందరికీ తెలిసిందే. అంటే.. పీఆర్సీ వచ్చే వరకు మధ్యంతరంగా ఉద్యోగులకు కొంత మొత్తం ఇస్తారు. పీఆర్సీవచ్చాక.. దీనిని దాని నుంచి మినహాయించుకుంటారు. అయితే.. ప్రభుత్వం పీఆర్సీని రద్దు చేసినా.. మరో పీఆర్సీ వేయలేదు. ఐఆర్ కూడా ప్రకటించలేదు.
ఇక, జగన్ 2019 ఎన్నికల సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.కానీ, దీనిని ఆయన చేయలేక పోయారు. తనకు అవగాహన లేకే.. అప్పుడు హామీ ఇచ్చానని పేర్కొంటూ.. మధ్యంతరంగా గ్యారెంటీ పింఛను స్కీం(జీపీఎస్)ను ప్రకటించారు. దీనిని కొనసాగిస్తే.. సరిపోయేదానికి.. కూటమి ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. దీంతో ఇప్పుడు సీపీఎస్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.
కానీ, ఏడాది పూర్తయినా కూటమి నుంచి ఎలాంటి ప్రకటనా రావడం లేదు. పైగా.. ఉద్యోగుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో కూటమి సర్కారు ఏడాది కాలంలో చేసిన ఈ రెండు నిర్ణయాలు.. తడబాటును సూచిస్తున్నాయన్నది పరిశీలకులు చెబుతున్నారు. ఫలితం ఉద్యోగులు ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉన్నారన్నది వారు చెబుతున్న మాట.