పవన్ విత్ లోకేష్ : డామినేట్ చేస్తోంది ఎవరు ?
ఏపీ రాజకీయాల్లో ఫ్యూచర్ లీడర్స్ ఉన్నారు. వారు కూడా కూటమిలో ఉన్నారు. ఈ రోజున ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది.
By: Tupaki Desk | 14 May 2025 9:47 AM ISTఏపీ రాజకీయాల్లో ఫ్యూచర్ లీడర్స్ ఉన్నారు. వారు కూడా కూటమిలో ఉన్నారు. ఈ రోజున ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. నాయకత్వం వహిస్తున్నది సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న చంద్రబాబు. ఆయన వయసు అనుభవం, రాజకీయంగా ఆయనకు ఉన్న పరిజ్ఞానం అన్నీ కలసి కూటమి పెద్దగా చేశాయి. అందువల్ల కూటమికి బాబు నాయకత్వం విషయంలో ఎలాంటి ఇబ్బంది కానీ వివాదం కానీ లేదు.
సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ అనేక సార్లు బహిరంగంగానే చంద్రబాబు నాయకత్వం ఏపీలో మరింత కాలం పాటు కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే బాబు యాక్టివ్ గా ఉన్నంతసేపూ ఆయన తోడుగానే ఉంటూ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో వ్యవహారాలను చూస్తారు అన్నది తెలిసిందే.
ఇక బాబు తరువాత కూటమిని నాయకత్వం ఎవరు వహిస్తారు అన్నది ఇప్పటికైతే తొందరతో కూడిన ప్రశ్నగానే చూడాలి. పైగా ఊహాజనితమైన ప్రశ్న అని కూడా అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో భవిష్యత్తు మీద చర్చలే ఎక్కువగా ఉంటాయి. గతం గురించి ఎవరూ ఆలోచించరు. మరో అయిదేళ్ళ తరువాత ఏమవుతుంది, పదేళ్ళ తరువాత ఎలా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు రాజకీయ పార్టీలూ చేస్తాయి. వాటి మీదనే రాజకీయ విశ్లేషణలూ ఉంటాయి.
ఆ విధంగా ఆలోచిస్తే కూటమికి బాబు ముఖ్యమంత్రి అయితే పవన్ ఉప ముఖ్యమంత్రి సో బాబు తరువాత ప్లేస్ పవన్ దే అన్నది ఒక సూత్రబద్ధమైన వాదన. జనసైనికులు కూడా అదే అంటారు. అయితే కూటమిలో పెద్ద పార్టీ టీడీపీ కాబట్టి ఆ పార్టీ తరఫున చూస్తే బాబు తరువాత వారసుడు సిద్ధంగా ఉన్నారు, అదే నారా లోకేష్ అని అంటారు.
ఇలా పార్టీల వాదనలు అభిప్రాయాలు ఆలోచనలు ఎలా ఉన్నా జనంలో చూస్తే పరిస్థితి ఎలా ఉంది అన్నది కనుక ఆలోచిస్తే పవన్ లోకేష్ కలసి పర్యటనలు చేసినా ఒకే వేదిక మీద నుంచి సభలలో మాట్లాడినా ఎక్కువ స్పందనను అయితే పవన్ అందుకుంటున్నారు అన్నది ఒక విశ్లేషణ.
స్వతహాగా పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ నిండుగా ఉన్న నటుడు. అంతే కాదు ఆయన ఒక రాజకీయ పార్టీని సొంతంగా స్థాపించి పదేళ్ళుగా నడుపుతూ సొంత నాయకత్వం కలిగిన వారు వెనక బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి. దాంతో ఆయనకంటూ ఒక బలం బలగం ఉన్నాయి కదా అన్నది కూడా ఉంది.
అదే సమయంలో లోకేష్ వెనక కూడా బలమైన పార్టీ బలగమూ అన్నీ ఉన్నాయి. అయితే ఇమేజ్ విషయంలోనే కొంత తేడా వస్తోంది అని అంటున్నారు. లేటెస్ట్ గా అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలలో పవన్ లోకేష్ కలిసి పాల్గొన్నారు.
అయితే అక్కడ జనం ఫోకస్ కానీ మీడియా ఫోకస్ కానీ మొత్తం పవన్ మీదకే మళ్ళాయి. పవన్ ఓదార్పే అందరూ హైలెట్ చేశారు. పవన్ చుట్టూనే కెమెరాలు తిరిగాయి. నిజానికి నారా లోకేష్ మురళీ పార్ధివ కాయాన్ని భుజం కాసి మోసారు. ఆయన గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారు.
ప్రభుత్వం చేసిన చేయబోతున్న సహాయం గురించి కూడా వివరించారు. ఇక పవన్ కంటే ముందు వచ్చి ఆ అంత్యక్రియలు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. కానీ పవన్ కి ఉన్న మాస్ ఇమేజ్ వల్ల ఆయన రాకతో మొత్తం సీన్ మారిపోయింది. అన్నింటా పవన్ కనిపించారు.
దాంతో సోషల్ మీడియాలో దీని మీదనే చర్చ సాగుతోంది. పవన్ లోకేష్ కలసి పాల్గొన్న కార్యక్రమాలలో ఎక్కువగా పవన్ హైలెట్ అవుతున్నారు అన్నదే సోషల్ మీడియా డిస్కషన్ గా ఉంది. నిజానికి ఇలాంటి చోట ఎవరు ఏమిటి అన్నది ఒక చర్చగా తీసుకుని రాకూడదు కానీ నెటిజన్లకు వీటితో పనిలేదు. దాంతో పవన్ మాస్ కా దాస్ అంటూ వారు అంటున్నారు.
ఏది ఏమైనా లోకేష్ స్పీచులన్నీ ఇటీవల మాస్ కి ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మరింతగా తన పొలిటికల్ గ్రామర్ తో గ్లామర్ ని కూడా పెంచుకోవాల్సి ఉందని పవన్ తో పాల్గొనే సభలలో మరింతగా జనం అటెన్షన్ పొందేలా సరికొత్త వ్యూహాలతో సిద్ధంగా ఉండాలని సూచించేవారూ ఉన్నారు.
