Begin typing your search above and press return to search.

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ‘కూటమి’ పరం... ఇక బ్యాటింగే..!

తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఏసీఏ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

By:  Tupaki Desk   |   17 Aug 2025 9:28 AM IST
ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ‘కూటమి’ పరం... ఇక బ్యాటింగే..!
X

ఏటా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నుంచి దండిగా నిధులు... లక్షల్లో అభిమానులు.. ఎంతో పేరుప్రతిష్ఠలు... ఇలాంటి వనరులు ఉన్నవే రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు. తెలంగాణకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ), ఆంధ్రప్రదేశ్‌కు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ). సహజంగానే క్రికెట్‌ అత్యంత ప్రాముఖ్యం ఉన్న క్రీడ కాబట్టి రాజకీయాలు, రాజకీయ నాయకులు ఓచేయి వేస్తుంటారు. క్రికెట్‌ అనే కాదు.. దేశంలో చాలా క్రీడల్లో ప్రస్తుతం రాజకీయ ప్రమేయం స్పష్టం. తాజాగా ఏసీఏ.. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార కూటమి చేతుల్లోకి వెళ్లింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఏకగ్రీవంగా ఏసీఏ అధ్యక్షుడయ్యారు.

ఎవరు పవర్‌లో ఉంటే వారికే..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల కనుసన్నల్లో నడిచింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సన్నిహితులు ఏసీఏను నియంత్రణలో పెట్టుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రోహిత్‌రెడ్డి, కార్యదర్శిగా గోపీనాథ్‌రెడ్డి ఉన్నారు. ఇప్పుడు టీడీపీ కూటమి వంతు.

ఇదే కొత్త కార్యవర్గం..

తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఏసీఏ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిన్నితో పాటు అత్యంత కీలకమైన కార్యదర్శి పదవికి టీడీపీకే చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవి ఎన్నిక సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. 34 మంది కొత్త కారవ్యర‍్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం.. మూడేళ్ల పాటు కొనసాగనుంది.

-కాగా, ఏపీలో క్రికెట్‌ అభివృద్ధికి, స్టేడియాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని చిన్ని చెబుతున్నారు. రాష్ట్ర క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చూస్తామంటున్నారు. మరోవైపు గత కార్యవర్గంపై వచ్చిన ఆరోపణలను కొత్త కార్యవర్గం విచారణ చేయడం ఖాయం.

కొసమెరుపుః గత ఏడాది కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకు ఆగస్టులో అప్పటి ఏసీఏ కార్యవర్గాన్ని రాజీనామా చేయించారు. నాటినుంచి కార్యకలాపాల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఏడాది అనంతరం ఇప్పుడు చిన్ని అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎస్‌ఈసీకి అప్పటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పెద్ద జగడమే నడిచింది.