దసరా నాటికి మంత్రి వర్గం కూర్పు.. నిజమేనా..!
ఇద్దరు ముగ్గురు నాయకులకు మంత్రులుగా అవకాశం ఇస్తామని అప్రకటిత హామీలు ఇచ్చిన నేపథ్యంలో వారంతా ఎదురు చూస్తున్నారు
By: Tupaki Desk | 7 Jun 2025 7:40 PM ISTకూటమి సర్కారులో మంత్రి వర్గ కూర్పు విషయం చర్చగా మారింది. ఇద్దరు ముగ్గురు నాయకులకు మంత్రులుగా అవకాశం ఇస్తామని అప్రకటిత హామీలు ఇచ్చిన నేపథ్యంలో వారంతా ఎదురు చూస్తున్నారు. వీటిలో ఒకటి జనసేనకు కేటాయించాల్సి ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. కానీ, ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. వాస్తవానికి ఈ ఏడాది ఉగాది నాటికి మార్పు ఉంటుందని అనుకున్నారు.
కానీ, దీనికి ముందు జరిగిన జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యం లోనే మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేశారన్న చర్చ ఉంది. మరోవైపు.. ఇప్పటికిప్పుడు మంత్రివర్గాన్ని మార్చడం కూడా..చంద్రబాబుకు ఇష్టం లేదని చెబుతున్నారు. మంత్రి వర్గాన్ని మార్చడం అంటే.. సదరు మంత్రులు సరిగా పనిచేయడం లేదన్న సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని.. తద్వారా తనకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మంత్రివర్గాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, బీజేపీ నుంచి మరో సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కృష్నాజిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు.. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక, కడపకు చెందిన మరో నాయకుడు కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నారని అంటున్నా.. ఆయన వివాదాల్లో చిక్కుకోవడంతో ఏమేరకు అవకాశం ఉంటుందన్నది ప్రశ్నగా మారింది.
ఇక, టీడీపీలోనే మరో నాయకుడి కోసం.. ప్లేస్ రెడీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఓసీ సామాజిక వర్గా నికి చెందిన నాయకుడు కావడం..గతంలో టికెట్‌ను కూడాత్యాగం చేసిన నేపథ్యంలో ఆయనను సంతృప్తి పరచాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేస్తే.. ప్రభుత్వంపై ప్రభావం పడుతుంద ని అంచనా వేస్తున్న చంద్రబాబు.. వచ్చే దసరా నాటికి మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అత్యంత సన్నిహితులకు కూడా తేల్చి చెప్పారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
