Begin typing your search above and press return to search.

లెక్క‌లు చూస్తున్నారు.. జాగ్ర‌త్త అమాత్యా.. !

ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు గవర్నర్ ను కలిసి వచ్చారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు ఖాయం అన్న చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   13 July 2025 4:00 AM IST
లెక్క‌లు చూస్తున్నారు.. జాగ్ర‌త్త అమాత్యా.. !
X

మంత్రివర్గంపై సీఎం చంద్రబాబు పెద్దగా సంతృప్తి అయితే వ్యక్తం చేయటం లేదనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడు కేబినెట్ సమావేశాలు నిర్వహించినా మంత్రులను హెచ్చరించారు.. మంత్రులకు క్లాసిచ్చారు.. అనే వార్తలు సాధారణంగా వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఒకరిద్దరు మంత్రులను 1-1 మాట్లాడి వారి లోపాలను ఎత్తి చూపారని.. వారిపై తాను చేయించిన సర్వే రిపోర్టులను కూడా వారికి ఇచ్చి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారని కూడా అనేక సందర్భాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి క్యాబినెట్ తో సంబంధం లేకుండానే మంత్రులకు ఫోన్ల ద్వారా కూడా సీఎం చంద్రబాబు సూచనలు చేశారని వారి పనితీరును మార్చుకోవాలని హెచ్చరికలు రావడం అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఇద్దరు కీలక మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. సూర్య భాయ్ అనే పేరుతో ఓ మంత్రిపై ఓ పత్రిక రాసిన కథనం సంచలనంగా మారింది. ఆ మంత్రి కోస్తాకు చెందిన మంత్రి అని తేలింది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. మ‌రో మంత్రి పని తీరుపై కూడా చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే చిత్రం ఏంటంటే వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడమే. మరోవైపు ఓ మహిళ మంత్రిపై కూడా చంద్రబాబు అసంతృప్తితోనే ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో సదరు మంత్రి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనేది చంద్రబాబు అంతర్గత సమావేశంలోనే చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు గవర్నర్ ను కలిసి వచ్చారు. దీంతో మంత్రివర్గంలో మార్పులు ఖాయం అన్న చర్చ మొదలైంది. ఏడాది కాలంలోనే మంత్రివర్గాన్ని మారుస్తారా? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కూటమిని సర్దుబాటు చేయాల్సిన అవసరాలు, కూటమిలో అసంతృప్తి పెరగకుండా, ప్రజల్లో ప్రభుత్వం పట్ల మైనస్ మార్కులు పడకుండా చూడాలంటే మంత్రి వర్గానికి ఎప్పుడైనా మార్చుకునే హక్కు, అవకాశం సీఎంగా చంద్రబాబుకు ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఆయన లెక్కలు చూసుకున్న నేపథ్యంలో ఇద్దరి నుంచి ముగ్గురు వరకు మంత్రులు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు జనసేనకు కూడా ఒక మంత్రి పదవిని ఇస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా బీజేపీ నుంచి మరో మంత్రిని తీసుకోవాలని పైనుంచి ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో గవర్నర్‌ను చంద్రబాబు కలవడం, ఆ వెంటనే మంత్రివర్గంపై చర్చ రావడం వంటివి ఆసక్తిగా మారాయి. కాబట్టి ఇప్పటికైనా మంత్రులు... ముఖ్యంగా చంద్రబాబు దగ్గర మైనస్ మార్కులు ఉన్నాయని భావిస్తున్న మంత్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.