బడ్జెట్ భేటీ: ఆయుధాలు రెడీ చేసిన కూటమి.. !
ఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాలు మరింత వేడి రగిలించనున్నాయి.
By: Garuda Media | 7 Feb 2026 10:00 PM ISTఈ నెల 11 నుంచి ప్రారంభం అవుతున్న బడ్జెట్ సమావేశాలు మరింత వేడి రగిలించనున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు పార్టీలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై వచ్చిన సీబీఐ నివేదికను అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టి.. వైసీపీని ఎండగట్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. దీనిని అజెండాలోనూ చేర్చనున్నారు.
అయితే.. ఈ విషయంపై చర్చించేందుకు అయినా.. వైసీపీ వస్తుందా? రాదా? అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఎన్నిసార్లు అసెంబ్లీ నుంచి అభ్యర్థనలు వెళ్లినా.. పార్టీ పరంగా అసెంబ్లీకి దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్న దరిమిలా.. ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లలేదు. కానీ. ఈ దఫా నెయ్యి కల్తీ అంశాన్ని అజెండాలో చేర్చనున్న దరిమిలా.. ఇప్పుడైనా వైసీపీ కదులుతుందా? అనేది చూడాలి.
కూటమి వ్యూహం రెండు రకాలుగా ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా.. వైసీపీ రాజకీయ వ్యవహారాలను ఎండగట్టడంతో పాటు.. ఎప్పటికప్పుడు.. వైసీపీ చేస్తున్న వివాదాలను కూడా సభ దృష్టికి .. తద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించుకుంది. పరామర్శల యాత్ర పేరుతో జగన్ చేస్తున్న విన్యాసాలను కూడా సభలో ఎండగట్టనున్నారు. ఇక, ఇవి కాకుండా.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నా రని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిని కూడా సభలో చర్చించనున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఈ దఫా సభలో ఎక్కువ స్పేస్ ఇవ్వనున్నారు. తద్వారా వైసీపీని మరింత డైల్యూట్ చేయడమో.. ఆత్మరక్షణలో పడేయడమో చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మొత్తంగా ఇప్పటికే ఖరారైనట్టుగా భావిస్తున్న అజెండాలో నెయ్యి సహా పెట్టుబడులు, జగన్ చేస్తున్న రాజకీయాలు.. కుల రాజకీయాలు వంటి కీలక అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్న ట్టు తెలుస్తోంది. దీనిని అడ్డుకునేందుకు.. లేదా సమాధానం చెప్పేందుకు.. వైసీపీ ఏమేరకు ప్రయత్నిస్తుందన్నది చూడాలి.
