వైనాట్: 164 ఆర్ 175...?
రాష్ట్రంలో కూటమి పార్టీల నాయకుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి నిదానం ఏంటన్నది వారిలో పెరుగుతున్న కుతూహలం.
By: Garuda Media | 29 Nov 2025 11:00 PM ISTరాష్ట్రంలో కూటమి పార్టీల నాయకుల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి నిదానం ఏంటన్నది వారిలో పెరుగుతున్న కుతూహలం. ప్రస్తుతం కూటమి పార్టీల నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. వచ్చే 15 సంవత్సరాలు తమదే ప్రభుత్వమని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ మాట్లాడినా.. ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ కూటమిదే విజయం తధ్యమన్న చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సీట్లపై చర్చ సాగుతోంది. గత వైసీపీ హయాంలోనూ.. రెండున్నరేళ్లలోనే కొత్త నినాదం పుట్టుకువచ్చింది. అదే `వైనాట్ 175`. ఊరూవాడా దీనిని ప్రచారం చేశారు. అయితే.. ఇది అంతగా సక్సెస్ కాకపోగా.. రివర్స్ అయింది. అయితే, అన్ని పార్టీల విషయంలోనూ ఇలానే జరుగుతుందని చెప్పడానికి లేదు. సో.. కూటమి పార్టీల మధ్య ఈ విషయం చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికల్లో 164-175 అనే చర్చ సాగుతోంది.
గత ఎన్నికల్లో 164 స్థానాల్లో కూటమి పార్టీలు విజయం దక్కించుకున్నాయి. టీడీపీ ఏకమొత్తంలో 134, జన సేన 21, బీజేపీ 9 స్థానాల్లో విజయం దక్కించుకున్నాయి. మిగిలిన 11 స్థానాలను మాత్రమే వైసీపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య పెరుగుతుందన్న అంచనాలు కూటమి పార్టీ ల మధ్య ఉన్నాయి. గత ఎన్నికల్లో దక్కించుకున్న 164 స్థానాలు ఖాయమని కొందరు అంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా.. చంద్రబాబు-పవన్ జోడీకి మంచి మార్కులు వేస్తున్నారు.
ఇది కూటమి ప్రభుత్వం మరిన్నాళ్లు కొనసాగేందుకు దోహద పడుతోందన్న అంచనా ఉంది. అందుకే.. మరికొందరు నాయకులు 175 కు 175 తామే విజయం దక్కించుకుంటామని చెబుతున్నారు. ఇది అతిశయోక్తి గా అనిపించినా.. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇదే నినాదాలు చేస్తున్నారు. త్వరలోనే ఫ్లెక్సీలు వెలిసినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీల పరంగా నే కాకుండా.. ప్రభుత్వ పరంగా కూడా.. కొత్త ఉత్తేజంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో `వైనాట్ 175` దిశగా దూసుకుపోతామని ఒకరిద్దరు సీనియర్ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.
