ఏపీలో.. జిల్లాల వారీగా ఎవరి 'బలం' ఎంత.. ?
సీమలో టీడీపీ-బీజేపీలకు బలం కనిపిస్తోందని ఒక టాక్ నడుస్తోంది. టీడీపీకి సంస్థాగతంగా సీమలో బలం ఉంది.
By: Garuda Media | 7 May 2026 1:04 PM ISTవచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రంగం రెడీ అవుతోంది. వాస్తవానికి 2029 ఎన్నికలకు రెండున్న రేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే గెలుపు గుర్రం ఎక్కేందుకు కూటమి పార్టీలు సిద్ధమ వుతున్నాయి. సామాజిక వర్గాల వారీగా.. జిల్లాల వారీగా కూడా బలాన్ని లెక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏ జిల్లాలో ఎవరికి ఎంత బలం ఉంది? ఎక్కడ ఎవరికి ఎక్కువ స్థానాలు ఇస్తే విజయం దక్కించు కునేందుకు అవకాశం ఉంటుందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
సీమలో టీడీపీ-బీజేపీలకు బలం కనిపిస్తోందని ఒక టాక్ నడుస్తోంది. టీడీపీకి సంస్థాగతంగా సీమలో బలం ఉంది. అయితే.. ఇటీవల కాలంలో చిత్తూరు, అనంతపురంలో బీజేపీ కూడా బాగానే విస్తరిస్తోంది. పార్టీ తరఫున కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. కడపలోనూ ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. వీరిని సరైన దిశలో నడిపించడం ద్వారా సీమలో బీజేపీని విస్తరించాలన్న వ్యూహం కనిపిస్తోంది. దీనికి టీడీపీ కూడా కలసి వస్తే.. అనూహ్యంగా ప్రత్యర్థి పక్షం వైసీపీకి షాకివ్వవచ్చని భావిస్తున్నారు.
ఇక, కోస్తాంధ్ర సహా.. నెల్లూరు తదితర ప్రాంతాల్లో టీడీపీ విజృంభిస్తోంది. అయితే.. నాయకుల మధ్య సమన్వయం కొంత లోపంగా ఉన్నప్పటికీ.. దీనిపైనే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. దీనిని సాధించి.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా.. కృష్ణా, నెల్లూరు వంటి కీలక జిల్లాల్లో జనసేన+ టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. తద్వారా.. సామాజిక వర్గాల వారీగా.. ఇక్కడ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనిపైనా పార్టీలు దృష్టి పెట్టాయి.
ఇక, అందరికీ కీలకమైన ఉత్తరాంధ్రలో జిల్లాల వారీగా రాజకీయాలు చేయాలనే సూచనలు వస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో జనసేన+టీడీపీ ఉమ్మడిగా ముందుకు సాగితే.. మరింత బలం పెంచుకు నేందుకు అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో అది నిరూపణ కూడా అయింది. ఇక, విశాఖలో మూడు పార్టీలూ కలిసి ముందుకు సాగితే.. వైసీపీకి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా.. జిల్లాల వారీగా పార్టీల బలాబలాలను, సామాజిక వర్గాల సమీకరణలను కూడా అంచనా వేసుకుని ముందుకు సాగేలా ప్లాన్ చేస్తున్నారు.
