అండమాన్ నికోబార్ దీవుల్లో సత్తా చాటిన కూటమి.. టీడీపీ అభ్యర్థి ఎన్నిక
అండమాన్ నికోబార్ దీవుల్లో బీజేపీ.. టీడీపీ.. జనసేన కూటమి సత్తా చాటింది. విజయపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ గా టీడీపీకి చెందిన అభ్యర్థి తాజాగా విజయం సాధించారు.
By: Tupaki Desk | 25 April 2025 10:56 AM ISTఅండమాన్ నికోబార్ దీవుల్లో బీజేపీ.. టీడీపీ.. జనసేన కూటమి సత్తా చాటింది. విజయపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ గా టీడీపీకి చెందిన అభ్యర్థి తాజాగా విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీకి 2022-23లో ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా ఏ పార్టీకి అధిక్యం లభించలేదు. దీంతో.. బీజేపీ.. టీడీపీ సభ్యులు కూటమిగా ఏర్పడి ఏడాదికి ఒకరు చొప్పున ఛైర్ పర్సన్ గా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా రెండేళ్లు జరిగింది. తొలి ఏడాది బీజేపీ సభ్యుడు.. ఆ తర్వాత ఏడాది టీడీపీ సభ్యుడు ఎన్నికయ్యారు. అయితే.. మూడో ఏడాది మాత్రం అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ సభ్యుడు హమీద్ ఛైర్ పర్సన్ గా గెలుపొందారు. బీజేపీ.. ఇండిపెండెంట్ సభ్యుడి మద్దతుగా ఆయన విజయం సాధించారు.
మొత్తం 24 ఓట్లలో హమీద్ కు 15 ఓట్లు సాధించారు. దీంతో.. కాంగ్రెస్ కు చెందిన ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సనర్ సుదీప్ రాయ్ శర్మ ఓటమిపాలు కాగా.. టీడీపీ సభ్యుడు ఛైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. మన మున్సిపల్ చట్టానికి.. అండమాన్ నికోబార్ లోని మున్సిపల్ చట్టానికి కాస్త తేడా ఉంది. ఇక్కడ మున్సిపల్ చట్టం ప్రకారం ఏ పార్టీకి అధిక్యం ఉన్నా లేకున్నా ప్రతి ఏడాది ఛైర్ పర్సన్ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతి ఏటా ఎన్నికలు అనివార్యం. టీడీపీ సభ్యుడి ఎన్నికలో కీలక పాత్ర పోషించిన వారందరికి అండమాన్.. నికోబార్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. ప్రజాసంక్షేమమే ఎజెండాగా టీడీపీ పని చేస్తుందని వ్యాఖ్యానించారు. ఛైర్ పర్సన్ గా ఎన్నికైన షాహుల్ హమీద్ కు అభినందనలు తెలియజేశారు.
