అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత.. భారత్ కీలక పరీక్షలు!
అవును... అండమాన్ నికోబార్ గగనతలం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
By: Tupaki Desk | 23 May 2025 4:02 PM ISTఅండమాన్ నికోబార్ దీవుల చుట్టూ ఉన్న ప్రాంతంలోని గగనతలాన్ని మే 23, 24 మధ్య మూడు గంటల పాటు మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ సమయంలో ఏ పౌర విమానమూ ఈ గగనతలాన్ని ఏ ఎత్తులోనూ ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత అధికారులు జారీ చేసిన నోటీస్ టు ఎయిర్ మెన్ (ఎన్.ఓ.టీ.ఏ.ఎం) తెలిపింది.
అవును... అండమాన్ నికోబార్ గగనతలం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా... మే 23-24 తేదీల్లో ఈ ప్రాంతంలో భారత క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు రోజుల్లోనూ ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు.
వాస్తవానికి అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాన్ని భారత్ తన క్షిపణి పరీక్షల కోసం తరచూ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా.. ఈ ఏడాది జనవరిలో సాల్వో మోడ్ లో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని పరీక్షించింది. గత ఏడాది ఏప్రిల్ లోనూ బాలిస్టిక్ క్షిపణిని.. 2022 మార్చిలో బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
కాగా.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకే లోని ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అవి ఫుల్ సక్సెస్ రేటుతో లక్ష్యాలపై దాడి చేశాయి. దీంతో.. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో.. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే.. పలు క్షిపణి పరీక్షలను సైతం నిర్వహించనుంది. ఇందులో భాగంగానే... ఈ నెల 23-24 తేదీల్లో అండమాన్ నికోబార్ దీవుల గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
