అనంతపురం టీడీపీకి వెరైటీ ట్రీట్‌మెంట్.. జన సేనకు మేయర్ పదవి!
స్థానిక ఎన్నికల్లో భాగంగా పట్టణ సంస్థలకు ఈ రోజు లేదా రేపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 13 Oct 2026 9:02 AM ISTతెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్న చోట స్థానిక సంస్థల పదవులను మిత్రపక్షాలకు కేటాయించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందన్న ప్రచారం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి నడిపించడానికి ఇదొక్కటే మార్గమని టీడీపీ పెద్దల ఆలోచనగా ఉందని చెబుతున్నారు. పార్టీ శ్రేణుల మధ్య సామరస్యం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేని చోట పదవులను మిత్రులకు అప్పగించడం ద్వారా, అంతర్గత కొట్లాటకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులోభాగంగా రాయలసీమలోని అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ను జనసేనకు కేటాయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో భాగంగా పట్టణ సంస్థలకు ఈ రోజు లేదా రేపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికావడంతో నోటిఫికేషన్ విడుదలే ఆలస్యంగా చెబుతున్నారు. మరోవైపు కూటమి అగ్రనేతలు పొత్తులపై చర్చించేందుకు భేటీ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి తీసుకుని అధికారికంగా ప్రకటించాలని చూస్తున్నారని అంటున్నారు. 17 కార్పొరేషన్లకు జనసేన మూడు నుంచి నాలుగు స్థానాలు ఆశిస్తోందని అంటున్నారు. ఇందులో విజయవాడ విషయంలో రెండు పార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, విజయవాడ కార్పొరేషన్ ను జనసేనకు అప్పగించే చాన్స్ అధికంగా ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో కాకినాడ కార్పొరేషన్ ను కూడా జనసేన తీసుకుంటోందని అంటున్నారు. దీంతో మిగిలిన రెండు కార్పొరేషన్ల కోసం జనసేన రాయలసీమలోని మూడు నగరాలు, కోస్తాలో మరో రెండు నగరాలను పరిశీలిస్తోందని చెబుతున్నారు. అయితే జనసేన అడుగుతున్న విజయవాడ, కాకినాడపై టీడీపీ కూడా సానుకూలంగా ఉందని, ఇదే సమయంలో రాయలసీమలో అనంతపురం కూడా జనసేనకే వదిలేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. వాస్తవానికి రాయలసీమలో తిరుపతి లేదా చిత్తూరు స్థానాలను జనసేన కోరుకుంటుండగా, టీడీపీ మాత్రం అనంతపురం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపైనే ఆశ్చర్యం వ్యక్తం అవుతూందని అంటున్నారు.
తమ పార్టీ శ్రేణులకు ఝలక్ ఇచ్చేందుకు, ఎన్నికల్లో నష్టం జరగకుండా చూసుకునేందుకే టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అనంతపురం నగరంలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వర్గపోరు తారాస్థాయిలో నడుస్తోందని చెబుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి వర్గానికి మేయరు సీటు ఇచ్చినా ప్రత్యర్థి వర్గం సహకరించే పరిస్థితి కనిపించడం లేదని టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ రెండు వర్గాల మధ్య పంచాయతీ నిర్వహించి ఎన్నికల్లో ఏకతాటిపై పనిచేయాలని ఒప్పించడం కన్నా, రెండు వర్గాలకు బుద్దిచెప్పేలా మిత్రపక్షానికి సీటు వదిలేసి, తప్పనిసరిగా గెలిపించుకుని రావాల్సిందిగా లక్ష్యం విధించడమే ఉత్తమమైన మార్గమని టీడీపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో అనంతపురం కార్పొరేషన్ ను జనసేనకు కేటాయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.
