Begin typing your search above and press return to search.

కరువు నేలలో కాశ్మీర్ యాపిల్ సాగు.. అనంత రైతు అద్భుత ప్రయోగం

రాయలసీమ వ్యవసాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తీవ్రమైన ఎండలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో యాపిల్ సాగు విజయవంతమైంది.

By:  Tupaki Political Desk   |   14 April 2026 6:00 AM IST
కరువు నేలలో కాశ్మీర్ యాపిల్ సాగు.. అనంత రైతు అద్భుత ప్రయోగం
X

రాయలసీమ వ్యవసాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తీవ్రమైన ఎండలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో యాపిల్ సాగు విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనాలను పటాపంచలు చేస్తూ, యాపిల్ తోటలు తొలి పంట దిగుబడిని అందించాయి. కరువు సీమగా ఉన్న పేరును చెరిపివేసి, ఉద్యానవన పంటల హబ్‌గా రాయలసీమ రూపుదిద్దుకోవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో యాపిల్ సాగు ఉద్యాన రంగంలో సరికొత్త రికార్డుగా చెబుతున్నారు.

సిమ్లా, కాశ్మీర్ వంటి చల్లని, ఎత్తైన కొండ ప్రాంతాల్లోనే యాపిల్ పండుతుందనే అపోహలను పటా పంచలు చేస్తూ అనంత రైతులు సక్సెస్ సాధించారు. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో ముగ్గురు రైతులు 15 ఎకరాల్లో యాపిల్ తోటలను పెంచుతున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని మొక్కలు పెరగడమే కాకుండా దిగుబడి కూడా బాగా వచ్చిందని చెబుతున్నారు. ఉద్యానవన అధికారుల సూచనలతో కాశ్మీర్ లోచిల్లీ డెలిషియస్ (కేఎల్డీ) అనే రకం యాపిల్స్ సాగు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

గార్లదిన్నె మంలం కోటంకా గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి తనకు ఉన్న రెండున్నర ఎకరాల్లో యాపిల్ పంట వేశారు. రెండేళ్ల క్రితం 1500 మొక్కలు నాటగా, అవి ఇప్పుడు కాపునకు వచ్చాయని చెబుతున్నారు. ఒక్కొ మొక్కను రూ.280 చొప్పున కొనుగోలు చేశారు. సేంద్రియ విధానంలో సాగు చేయడంతో డిసెంబరులో పూత వచ్చిందని, ఇప్పుడు కాయలు కాసి కోతకు వచ్చాయని చెబుతున్నారు. ఎకరాకు టన్ను వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. మధ్యస్త పరిణామంలో ఉండే యాపిల్ పండ్లు కాశ్మీర్ యాపిల్ కన్నా తియ్యగా రుచిగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. దానిమ్మ తోటల మాదిరిగా యాపిల్ కూడా రెండో ఏడాది నుంచి కోత ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

రాయలసీమ వంటి తక్కువ వర్షాభావం ఉన్న ప్రాంతంలో యాపిల్ సాగు చేయడం పెద్ద సాహసంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో రైతులు ఎక్కువగా వేరుశనగ పండించే వారు. వర్షాలు పడక, సాగునీరు అందుబాటులో లేక దిగుబడి సరిగా లేక నష్టపోయే వారు. ఈ వరుస కష్టాలతో విసిగిపోయిన రైతులు ఉద్యాన పంటలపై దృష్టి మళ్లించారు. ఇదే రైతుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందని అంటున్నారు. చాలా మంది రైతులు మామిడి, చినీ వంటి తోటలను సాగు చేస్తుండగా, తాజాగా కొందరు రైతులు యాపిల్ కూడా పండించాలని నిర్ణయం తీసుకోవడం విశేషంగానే చెబుతున్నారు. మొత్తానికి రైతులు ధైర్యం చేసి యాపిల్ సాగు చేయడంతో మంచి ఫలితమే వచ్చిందని అంటున్నారు.