Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నం: కాశ్మీర్ ఆపిల్‌కు గ‌ట్టి పోటీనిస్తున్న 'అనంతపురం ఆపిల్'

ఈ ప్రయోగంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఉత్తరాది రాష్ట్రాల్లో పండే ఆపిల్స్ కంటే అనంతపురం ఆపిల్స్‌కు మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండటం.

By:  Sivaji Kontham   |   28 April 2026 12:00 AM IST
సంచ‌ల‌నం: కాశ్మీర్ ఆపిల్‌కు గ‌ట్టి పోటీనిస్తున్న అనంతపురం ఆపిల్
X

భారతదేశంలో ఆపిల్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి జమ్మూ కాశ్మీర్- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు. అయితే ఇప్పుడు వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు ఏపీలోని రాయలసీమ సిద్ధమవుతోంది. తీవ్ర కరువు కాటకాలకు నిలయమైన అనంతపురం జిల్లాలో ఆపిల్ పంట పండుతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలోని గర్లాదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన కె.వి. రమణారెడ్డి అనే సాహసోపేతమైన రైతు తన 2.5 ఎకరాల పొలంలో ఆపిల్ సాగు చేసి అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఇజ్రాయెల్ నుండి సుమారు 1500 మొక్కలను దిగుమతి చేసుకున్న ఆయన ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

ఈ ప్రయోగంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఉత్తరాది రాష్ట్రాల్లో పండే ఆపిల్స్ కంటే అనంతపురం ఆపిల్స్‌కు మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండటం. ఉత్తరాది ఆపిల్స్ కిలో రూ. 50 నుంచి రూ. 100 వరకు ధర పలుకుతుంటే.. అనంతపురం ఆపిల్స్ నాణ్యతను బట్టి కిలో రూ. 120 నుంచి రూ. 170 వరకు అమ్ముడవుతున్నాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన `కేఎల్‌డీ` (KLD) రకం ఆపిల్స్ మంచి రుచిని కలిగి ఉండటంతో పాటు మార్కెట్‌లో ఆపిల్స్ కొరత ఉండే `ఆఫ్-సీజన్`లో ఇవి చేతికి రావడం రైతుకు కలిసి వస్తోంది. ముఖ్యంగా వేడి వాతావరణం కలిగిన రాయలసీమ ప్రాంతంలో శీతల వాతావరణ పంట అయిన ఆపిల్ సాగు ఉత్త‌మ ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని కుందుర్పి, పెదపప్పూరు మండలాల్లో కూడా సుమారు 15 ఎకరాల్లో ఈ సాగు విస్తరించింది.

ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ సాగులో కొన్ని కీలకమైన సానుకూల అంశాలు ఉన్నాయి. కాశ్మీర్, హిమాచల్‌లో ఆపిల్ చెట్టు కాపుకు రావడానికి 7 నుంచి 8 ఏళ్ల సమయం పడితే.. అనంతపురంలో సాగు చేస్తున్న ఈ రకం రెండో ఏడాది నుంచే దిగుబడిని ఇస్తోంది. దీనివల్ల రైతుకు పెట్టిన పెట్టుబడి త్వరగా వెనక్కి వస్తుంది. అలాగే సాంప్రదాయ పద్ధతుల్లో హెక్టారుకు కేవలం 250 చెట్లు మాత్రమే నాటగలరు.. కానీ అనంతపురంలో అనుసరిస్తున్న సెమీ-హై డెన్సిటీ మోడల్ ద్వారా హెక్టారుకు ఏకంగా 3700 మొక్కల వరకు నాటే అవకాశం ఉంది. దీనివల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

ఆదాయం పరంగా చూస్తే.. ఎకరాకు 3 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తే.. సగటున కిలోకు రూ. 140 ధర పలికినా రైతుకు రూ. 4.2 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇది వేరుశనగ వంటి సంప్రదాయ పంటల కంటే ఎన్నో రెట్లు అధిక లాభం. అయితే అనంతపురం వంటి కరువు ప్రాంతంలో ఆపిల్ సాగు చేయడం వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఆపిల్ నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ తప్పనిసరి. అలాగే నల్లి వంటి తెగుళ్ల నివారణ.. తేనెటీగల ద్వారా పరపరాగ సంపర్కం వంటి అంశాల్లో రైతులకు శాస్త్రీయ అవగాహన అవసరం.

ప్రస్తుతానికి ఈ ప్రయోగాత్మక సాగు ఆశాజనకంగా ఉన్నా.. ప్రభుత్వం దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఆపిల్ సాగు ఒక మంచి ప్రత్యామ్నాయం అనిపిస్తున్నా..కనీసం రెండు మూడు పంటల కాలం పూర్తయ్యే వరకు వేచి చూడటం ఉత్తమం. ప్రభుత్వం తరపున సాంకేతిక సహకారం.. తెగుళ్ల నివారణా చర్యలు .. మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే.. రాబోయే రోజుల్లో `అనంతపురం ఆపిల్` కాశ్మీర్ ఆపిల్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.