Begin typing your search above and press return to search.

కోటాలో మరో రెండు ఆత్మహత్యలు... ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

తమ వృత్తి జీవితంలో ఎదగాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఈ విషయాలపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 12:59 PM GMT
కోటాలో మరో రెండు ఆత్మహత్యలు... ఆనంద్‌  మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
X

ఒత్తిడి భరించలేకో.. ఎదురవుతున్న సవాళ్లను సహించలేకో... ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలను నమ్ముకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా "కోటా"లో ఈ ఆత్మహత్యలు మరీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో రెండు వరుస ఆత్మహత్యలు జరిగాయి.

అవును... పోటీ పరీక్షల కోచింగ్‌ హబ్‌ గా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. భవిష్యత్తులో ఎన్నో సాధించి.. తమ వృత్తి జీవితంలో ఎదగాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఈ విషయాలపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.

ఈ ఏడాది కోటాలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ఈ బలవన్మరణాల వార్తలు తనను ఎంతగానో కలచివేస్తున్నాయని.. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల జీవితాలు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం తీవ్రంగా బాధిస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు కిలక సూచన చేశారు. ఈ వయస్సులో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం గురించి కాకుండా.. మీ గురించి మీరు తెలుసుకునేలా మీ లక్ష్యం ఉండాలని ఆనంద్ మహింద్రా సూచించారు. పరీక్షల్లో విజయం సాధించకపోవడమనేది కేవలం మీ మీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో "సూపర్ 30" కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఆనంద్‌ కుమార్.. వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.

ఇదే క్రమంలో... కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు విద్యను ఆదాయవనరుగా మాత్రమే చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపిన ఆయన... ప్రతి విద్యార్థిని సొంత బిడ్డలా భావించి శ్రద్ధ వహించాలని కోరుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా... మీరు సాధించలేని కలల్ని మీ పిల్లలపై రుద్దాలని చూడొద్దని తల్లితండ్రులకు విజ్ఞప్తి చేశారు.

కాగా... ఆదివారం మధ్యాహ్నం తాను కోచింగ్‌ తీసుకుంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి మహారాష్ట్రకు చెందిన అవిష్కర్‌ శంభాజీ కస్లే (17) అనే విద్యార్థి దూకేయగా.. అదేరోజు సాయంత్రం బిహార్‌ కు చెందిన ఆదర్శ్‌ రాజ్‌ (18) అనే మరో విద్యార్థి అద్దె గదిలో ఫ్యాన్‌ కు ఉరేసుకున్నాడు.