జగన్‌కు ఛాన్సివ్వని చంద్రబాబు.. ఏం చేశారంటే!
అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్ర మాదం జరిగింది.
By: Tupaki Desk | 14 April 2025 9:51 AM ISTఅనకాపల్లి జిల్లా కోటవురట్లలోని ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్ర మాదం జరిగింది. అకస్మాత్తుగా సంభవించిన పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందారు. అయితే.. ఈ ఘటనపై విపక్షం వైసీపీ స్పందించేందుకు సమయం తీసుకుంది. కానీ, ఈలోగానే.. ప్రభుత్వం చేయాల్సిన పనిచేసేసింది. వైసీపీ స్పందించే సమయానికి అన్నీ జరిగిపోయాయి. దీంతో జగన్‌కు ఛాన్సివ్వకుండా.. చంద్రబాబు సర్కారు హుటాహుటిన స్పందించిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
అనకాపల్లి ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే సమీపంలోని మంత్రి వంగలపూడి అనితను ముఖ్యమంత్రి చంద్రబాబు అలెర్టు చేశారు. ఘటనా ప్రాంతానికి వెళ్లాలని.. సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతేకాదు.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్న సంకేతాలు కూడా ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అనిత.. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సర్కారు సాయం చేస్తుందన్నారు.
మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికీ రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారంగా అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆ వెంటనే పరిహారాన్ని కొంత మొత్తం విడుదల చేయాలని.. కలెక్టర్‌ను కూడా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా అంతిమ సంస్కారాలకు సంబంధించి స్వచ్ఛంగా సాయం చేసేవారు ముందుకు రావాలని కోరారు. ఇదంతా కూడా.. కొన్ని గంటల్లోనే జరిగిపోయింది. అయితే.. తీరిగ్గా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు.
అనకాపల్లి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడ్డం తీవ్ర విచారకరమన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అయితే.. అప్పటికే సర్కారు సాయం ప్రకటించడం.. మంత్రి హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించడం కూడా అయిపోయిందని.. ముఖ్యమంత్రి కార్యాలయం `మినిట్స్` విడుదల చేయడం గమనార్హం.