అమరావతి 2.0...ఈసారి కొత్త సందేహాలు ఎన్నో ?
ఎన్ని కాగితాల మీద ఒప్పందాలు రాసుకున్నా ఇదంతా ఒక నమ్మకం అనే పునాది మీదనే జరిగిది అని అంతా అంటారు.
By: Tupaki Desk | 6 July 2025 9:40 AM ISTఅమరావతి అంటే చంద్రబాబు అపర విశ్వామిత్ర సృష్టి అన్న హైప్ ఉంటుంది. ఆయన మానస పుత్రిక అని కూడా చెబుతారు. చంద్రబాబు అయితే దేవతలు నివసించిన రాజధాని అని అభివర్ణిస్తూ ఉంటారు. పైగా ఇంద్రుడి నగరం అమరావతి ఈ అమరావతి రెండూ ఒక్కటే అని టీడీపీ నేతలు సైతం గొప్పగా చెబుతారు.
ఇక 2014లో విభజన ఏపీకి తొలిసారి సీఎం అయిన చంద్రబాబు అమరావతి రాజధానిని ప్రతిపాదించారు. ఆయన ఆ రోజులలో ఏకంగా 34 వేల ఎకరాలను భూసమీకరణ పేరిట తీసుకున్నారు. అంతకు ముందు అంటే 2013లో భూసేకరణ మీద కొత్త చట్టాలు వచ్చాయి. అవి భూములు ఇచ్చేవారికి ఎన్నో రక్షణలు కల్పిస్తూ అనేక రకాలుగా సేఫ్ జోన్ లో ఉంచుతూ వచ్చాయి.
దాని ప్రకారం చూస్తే భూసేకరణ అన్నది చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. కానీ ఆ తరువాత అమరావతిలో చేసిన భూ సేకరణ బదులు సమీకరణతో బాబు దేశంలోనే హైలెట్ అయ్యారు. ఒక విధంగా భూసమీకరణ అన్న కొత్త కాన్సెప్ట్ తో ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 34 వేల ఎకరాల భూములను రైతులు భూ సమీకరణ కోసం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
ఎన్ని కాగితాల మీద ఒప్పందాలు రాసుకున్నా ఇదంతా ఒక నమ్మకం అనే పునాది మీదనే జరిగిది అని అంతా అంటారు. ఆ నమ్మకమే చంద్రబాబు అని చెబుతారు. అలా చంద్రబాబు సంపాదించుకున్న నమ్మకానికి విరగబడి మరీ భూములు ఇచ్చేశారు. అయితే గత పదకొండేళ్లుగా అమరావతి విషయం చూస్తే అలాగే ఉంది. ఈ రోజుకీ అమరావతి రాజధాని అన్నది ఇంకా ఊహల్లోనే ఉంది.
బ్లూ ప్రింట్ మీద ఉన్నది రియాలిటీ స్టేజికి రావాలంటే ఎన్నేళ్ళు పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అదే సమయంలో అమరావతి రాజధాని రైతులకు ఫ్లాట్లు వేసి ఇవ్వడం అన్నది కూడా ఇప్పటిదాకా జరగలేదు. వారు తమకు కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎపుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు.
అయితే దశాబ్దం క్రితం ఇచ్చిన వారి సంగతి అలా ఉంటే ప్రభుత్వం కొత్తగా మరో 44 వేల ఎకరాలని భూసమీకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అమరావతిలో వరద నీటి కాలువల విస్తీర్ణం వల్ల చాలా భూమిని కోల్పోవాల్సి వస్తోంది. అలాగే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ వంటి మరింత పొడవు వెడల్పు పెరుగుతున్నాయని అంటున్నారు. దాంతో మరింత భూమి విస్తీర్ణం తగ్గుతోంది అని అంటున్నారు. అంతే కాదు రిజర్వాయర్ల కోసం మరికొంత రాజధాని భూమి పోతుంది అని అంటున్నారు.
ఇక ప్రపంచ బ్యాంక్ కూడా అదనపు భూమిని తీసుకోవాలని కోరినట్లుగా చెబుతున్నారు. వాస్తవంగా అయితే చాలా అవసరాలు ఉన్నాయని అందుకే 57 వేల ఎకరాల భూమిని సేకరించాలని మొదట అనుకున్నారు కానీ ఇపుడు అది కాస్తా 44 వేల ఎకరాలకు తగ్గించారు. అమరావతి రాజధాని వల్ల పక్కన ఉన్న భూములు కోట్లలో విలువ పలుకుతున్నాయి. దాంతో ల్యాండ్ పూలింగ్ అన్నది కష్టంగా మారుతోంది.
అయితే అమరావతి రాజధానిలో అనేక భారీ ప్రాజెక్టులు భవిష్యత్తు అవసరాలు ఉన్నాయని అంటున్నారు. మరో యాభై ఏళ్ళ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని భూసమీకరణ చేస్తున్నారు. అయితే భూసేకరణకు కొంత అనుకూలత ఉంటే కొన్ని చోట్ల వ్యతిరేకత ఉందని అంటున్నారు.
ఎందుకంటే కళ్ళ ముందు పదేళ్ల పాటు అభివృద్ధి చెందని అమరావతి ఉంది. మొదటి వారికి న్యాయం చేస్తే తరువాత వారు ఆసక్తి చూపించే చాన్స్ ఉంది. కానీ ఇపుడు అక్కడ ఇంకా ప్రతిపాదన దశలో ఉంటే తమ భూములు ఎపుడు ఫ్లాట్స్ గా మారి బంగారాలు కురిపిస్తాయన్న సంశయం చాలా మందికి ఉంది అని అంటున్నారు. అంతే కాదు భూములు ఇవ్వకపోయినా రాజధాని సమీపంలో ఉన్న భూములుగా వాటి విలువ ఉన్నది. ఇపుడు కొత్తగా ఇచ్చి తాము భూములు లేకుండా చేసుకుని సీఆర్డీయే చుట్టూ తిరగాలా అన్నది చాలా మందిలో ఉన్న మాట.
ఇంకో వైపు చూస్తే అమరావతికి మొదట భూములు ఇచ్చిన వారు ముందు తమ సంగతి చూడమని డిమాండ్ చేస్తున్నారు. ఇక అక్కడ చాలా భూములు కొన్న వారు ఉన్నారు. వారు కూడా తమ భవిష్యత్తు మీద కూడా ఆలోచిస్తున్నారు. దాంతో ఇపుడు రెండవ విడత భూసేకరణ మీద కొంత చర్చ అయితే ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత కొంత వస్తోంది అని అంటున్నారు.
ఇక గుంటూరు జిల్లా పొన్నకల్లులో అయితే మేము సమీకరణకు భూములు ఇవ్వమని రైతులు తెగేసి చెప్పడంతో ఏకంగా గ్రామ సభలే రద్దు అయ్యాయి. ఇలాగే ముందు ముందు పరిస్థితి ఉంటే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. భూముల సమీకరణ రాజధాని నిర్మాణం ఇలా భారీ స్కేల్ తో సాగుతున్న వ్యవహారంగా రోజు రోజుకీ మారుతోంది. ఇది మెటీరియలైజ్ అయ్యేటప్పటికి ఎన్నాళ్ళు పడుతుంది అన్నది చాలా మందికో కలుగుతున్న ప్రశ్న. అదే సందేహంగా మారుతోందా అన్నదే ఇపుడు హాట్ డిబేట్ గా ఉంది.