Begin typing your search above and press return to search.

సంక్రాంతి వేళ.. హాట్ టాపిక్ గా 'అంపాపురం'

తాజాగా గన్నవరానికి పది కిలోమీటర్ల దూరంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై - కోల్ కతా నేషనల్ హైవే పక్కనే ఏర్పాటు చేసిన భారీ క్యాసినో (తాత్కాలికంగా) హడావుడి మరో లెవల్ గా ఉందంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 4:27 AM GMT
సంక్రాంతి వేళ.. హాట్ టాపిక్ గా అంపాపురం
X

సంక్రాంతి అన్నంతనే నగరాల నుంచి ఊళ్లకు వెళ్లటం.. ఎక్కడెక్కడ ఉన్న వారంతా తమ సొంతూర్లకు వెళ్లి.. తమ వారితో ఆనందంగా పండుగ చేసుకునే సంక్రాంతి వేళ.. కోడి పందెలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పక తప్పదు. అధికారికంగా ఎలాంటి అనుమతులు ఉండని వీటికి.. స్థానిక రాజకీయ నేతల అండతో పాటు.. ప్రభుత్వాలు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరించటం తెలిసిందే. తాజాగా గన్నవరానికి పది కిలోమీటర్ల దూరంలో అత్యంత రద్దీగా ఉండే చెన్నై - కోల్ కతా నేషనల్ హైవే పక్కనే ఏర్పాటు చేసిన భారీ క్యాసినో (తాత్కాలికంగా) హడావుడి మరో లెవల్ గా ఉందంటున్నారు.

పండక్కి ఊరుకు వచ్చినోళ్లే కాదు.. చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారు భారీగా ఈ క్యాసినో తరహా వేదికకు వస్తున్నారు. పండక్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇక్కడకు రోజులో ఏ టైంలో చూసినా యాభై వేలకు తగ్గకుండా వస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడిగా చెబుతున్న ఈ క్యాసినో తరహా పందాల బరి ఇప్పుడు అందరి నోట నానుతోంది.

ఇక్కడకు కార్లు.. టూ వీలర్లతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఏపీ డీజీపీ కార్యాలయానికి 40కి.మీ. దూరంలో ఉండే ఈ వేదికలో ఇంత భారీ ఎత్తున కోడి పందేలు సాగుతున్నా.. పట్టనట్లుగా ఉండటం ఏమిటి? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా దాదాపు పాతిక ఎకరాల్లో 50 టెంట్లు వేసి.. కోడి పందేలు.. కోతముక్క.. నంబర్లాట.. పొట్టేళ్ల పోటీలు.. ఇలా అన్ని రకాల ఆటలతో పాటు.. మందు.. విందులతో పసందైన తరహాలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లు షాకింగ్ గా మారాయి.

ఇక్కడి వ్యవహారమంతా హైటెక్ తరహాలో ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడకు ఎంట్రీ అయ్యే వేళలో.. ప్రతి ఒక్కరికి ట్యాగ్ తగిలించటం ఒక ఎత్తు అయితే.. ఎంట్రీ ఫీజు కింద భారీగా వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎంట్రీ ఫీజులోనూ పలు విభాగాలు ఉండటం.. పెట్టే ఖర్చుకు తగ్గట్లు లోపల వసతులు వేరుగా ఉంటాయి. అంతేకాదు.. కోడి పందేలు స్టార్ట్ అయ్యాయి.. రావాలంటూ మైకుల్లో ప్రకటనలతో పాటు.. భారీగా ఎల్ ఈడీ తెరల్ని అమర్చి మరి.. పండుగ విలాసాన్ని మరో లెవల్ కు తీసుకెళుతున్నట్లుగా చెప్పాలి.

ఇంత హడావుడి జరుగుతున్నా.. పోలీసులు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరించటం విశేషం. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలిరోజు రూ.10- 15 కోట్ల మేర పందేలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోడి పందేల ప్రధాన శిబిరంలో తొలి పోటీకే నిర్వాహకులు రూ.5లక్షలు పెట్టగా.. బయట పై పందాలు మరో రూ.15 లక్షలు కాసినట్లుగా చెబుతున్నారు. తొలిరోజు ఈ తరహాలో దాదాపు 20కు పైగా పోటీలు జరిగినట్లుగా తెలుస్తోంది.

రాత్రివేళ.. ప్రత్యేక బులెట్ పందేల్ని నిర్వహించారు. రెండు గ్రూపుల మధ్య ఏడు కోడి పందాలు పెట్టి.. వాటిల్లో నాలుగు ఎవరు గెలిస్తే వారికి బుల్లెట్ బహుమతిగా ఇచ్చారు. పొట్టేళ్ల పందాల్ని ప్రత్యేక శిబిరాల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రతి షాపును సబ్ లీజ్ కు ఇచ్చేశారు. మద్యం స్టాళ్లు మొదలుకొని.. ఫుడ్.. కొబ్బరిబోండాలు.. సిగిరెట్లు.. గుట్కా మొదలుకొని అవి ఇవి అన్న తేడా లేకుండాఅన్ని వసతులు ఉండేలా ఇక్కడ ఏర్పాట్లు ఉండటం గమనార్హం. దీంతో.. అంపాపురం ప్రాంతంలోని జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతోంది.