Begin typing your search above and press return to search.

మోడీదే మ‌ళ్లీ విజ‌యం.. రాసిపెట్టుకో 'ఇండియా'

ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీనే మ‌రోసారి ఈ దేశానికి ప్రధాని అవుతారని.. ఈమేర‌కు దేశ ప్ర‌జ‌లు కూడా నిర్ణ‌యించార‌ని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 8:54 AM GMT
మోడీదే మ‌ళ్లీ విజ‌యం.. రాసిపెట్టుకో ఇండియా
X

కొత్త డిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీనే మ‌రోసారి ఈ దేశానికి ప్రధాని అవుతారని.. ఈమేర‌కు దేశ ప్ర‌జ‌లు కూడా నిర్ణ‌యించార‌ని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని ఇండియా కూట‌మి రాసిపెట్టుకోవాల‌ని అన్నారు. 75 ఏళ్లలో ఈ దేశం 17 లోక్‌సభ ఎన్నికలు, 22 ప్రభుత్వాలు, 15 మంది ప్రధానమంత్రులను చూసిందని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ‌త ప‌దేళ్ల కాలంలో దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాట‌లో న‌డిపించార‌ని తెలిపారు. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తున్నాయని విమ‌ర్శించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజ‌కీయాలు, కులతత్వాన్ని నిర్మూలిం చడం ద్వారా ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ 10 సంవత్సరాలలో అభివృద్ధిని సాధించారని తెలిపారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోరంగా ఓడిపోతుందని అన్నారు.

మేం పాండ‌వులం

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ)ను పాండ‌వులుగా అమిత్‌షా అభివ‌ర్ణించారు. అదేస‌మ‌యంలో ఇండియా కూట‌మిని ఆయ‌న కౌర‌వులు పేర్కొన్నారు. " పాండవుల చేతిలో ఇండియా కూటమి కౌరవులకు ఓటమి తప్పదు. ఇకపై కుటుంబ వారసత్వ రాజకీయాలు చెల్లవు" అని వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలతోపాటు అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ పోరాటం చేస్తున్నారని అన్నారు. 7 కోట్ల మందికి విద్యుత్, ఆహారం, ఇతర అవసరాలను మోడీ ప్రభుత్వం తీర్చగలిగిందని వివరించారు.

మైనార్టీల సంక్షేమాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించిందని అమిత్ షా పేర్కొన్నారు. వారి అవసరాలను తీరుస్తామని స్పష్టం చేశారు. దేశ భద్రత తమ తొలి ప్రాధాన్యత అని అమిత్ షా తేల్చిచెప్పారు. భారతదేశ స్థాయిని నరేంద్ర మోడీ పెంచారని గుర్తుచేశారు. భ‌విష్య‌త్తులో ఈ దేశం ప్ర‌పంచంలో స‌గ‌ర్వ‌గా త‌లెత్తుకుని నిల‌బ‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు.