Begin typing your search above and press return to search.

అసలు సినిమా ముందుంది...అమిత్ షా కీలక వ్యాఖ్యలు

మణిపూర్ లో జరిగిన సంఘటనలు సిగ్గు చేటు అని మేము కూడా అంగీకరిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో పేర్కొనడం విశేషం.

By:  Tupaki Desk   |   9 Aug 2023 3:28 PM GMT
అసలు  సినిమా ముందుంది...అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

మణిపూర్ ఘటనలు ఎవరూ దాచే ప్రయత్నం చేయడం లేదు. మణిపూర్ లో జరిగిన సంఘటనలు సిగ్గు చేటు అని మేము కూడా అంగీకరిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో పేర్కొనడం విశేషం. వర్షాకాల పార్లమెంట్ సెషన్ ముందర ఇద్దరు మహిళల నగ్న వీడియోలు బయటకు రావడం పై ఆయన మాట్లాడుతూ దాన్ని పోలీసులకు ఇచ్చి ఉండాల్సింది అని విపక్షాలకు సలహా ఇచ్చారు.

మణిపూర్ లో బీజేపీ ఆరున్నరేళ్లుగా అధికారంలో ఉంది. ఎపుడూ హింస అన్నది లేదు, కానీ ఈ ఏడాది మే 3 నుంచి మాత్రమే అక్కడ హింసాయుత పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి కారణం హై కోర్టు తీర్పు. మెయితీలను గిరిజనులుగా ప్రకటించాక హింస మొదలైంది అని అమిత్ షా గుర్తు చేశారు. అయినా మేము మణిపూర్ విషయంలో చేతులు ముడుచుకుని మౌనంగా కూర్చోలేదని ఆయన అన్నారు.

మణిపూర్ ని తొలిసారిగా సందర్శించినది తనే అన్నారు. ఇక తమ శాఖ సహాయ మంత్రి అక్కడ 23 రోజులు ఉన్నారని సభ దృష్టికి తెచ్చారు. మణిపూర్ లో హింస వల్ల ఇప్పటిదాకా 152 మంది చనిపోయారు అని ఆయన సభకు వివరాలు అందించారు. హింసకు తావు లేకుండా శాంతిని నెలకొల్పడానికి చూస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. మణిపూర్ పరిణామాలకు అక్కడి సీఎం రాజీనామా చేయాల్సిన అవసరం అయితే లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ తొలగించాక ఏదో జరిగిపోతుందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఇపుడు అంతా ప్రశాంతంగా ఉందని ఆయన గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తో ఉగ్రవాదాన్ని అంతం చేసిన ప్రభుత్వం మాది అని ఆయన అన్నారు. మేము చెప్పినవి చేస్తాం, కబుర్లు చెప్పం, నిజాయతీగా ఉంటాం, అందుకే వాజ్ పేయి ఒక్క ఓటు తేడాతో అప్పట్లో అవిశ్వాసం ల్లో ఓడారు అని అమిత్ షా వెళ్లడించారు.

కాంగ్రెస్ చాలా చెబుతుంది, కానీ ఏమీ చేయదు, రైతులకు డెబ్బై వేల కోట్ల రుణ మాఫీ అంటూ తాయిలాలు ఇచ్చిందని విమర్శించారు. కానీ మేము రుణాలు లేని రైతులను చూడాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. అందుకే రైతులకు సాయంగా నిలబడుతున్నామని ఆయన చెప్పారు. ఈ దేశాన్ని వచ్చే అయిదేళ్ళలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని బీజేపీ చూస్తోందని అన్నారు. మాకు విజన్ ఉంది, ఎలా చేయాలన్నది కూడా తెలుసు అని అన్నారు.

మణిపూర్ మీద చర్చకు ఎపుడూ కేంద్రం వెనక్కి పోలేదని, ప్రతిపక్షాలే చర్చకు వెనకంజ వేశాయని ఆయన విమర్శించారు. మణిపూర్ ఇపుడిపుడే దారిలోకి వస్తోంది. దయచేసి అంతా సహకరించాలని కోరారు. ఈ అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారు అన్నది ప్రజలకు తెలుసు. మీ బలం మా బలం మీ ఆలోచనలు మా ఆలోచనలు అన్నీ కూడా ప్రజలకు మరోసారి తెలుస్తాయని ఆయన విపక్షాలకు చురకలు అంటించారు. ఒక ఎంపీ ఉన్నారు ఆయన 13 సార్లు రీ లాంచ్ అయ్యారు. 13 సార్లూ ఫెయిల్ అయ్యారంటూ ఇండైరెక్ట్ గా రాహుల్ గాంధీ మీద అమిత్ షా విసుర్లు విసిరారు.

విపక్షాలది రాజకీయమని, ఈ దేశం కోసం ఆలోచన బీజేపీదని ఆయన తేడా చెప్పారు. ఈ దేశం అభివృద్ధి మీద అజెండా తమకు ఉందని అన్నారు. విపక్షాలు ఇండియా కూటమి అంటూ కట్టారు. ఆగస్ట్ 9న క్విట్ ఇండియా దినమని, అందుకే ప్రధాని మోడీ క్విట్ ఇండియా అని మరోసారి పిలుపు ఇస్తున్నారు అని ఇండియా కూటమి మీద పంచులేశారు.

ఈ దేశానికి మోడీ ఎంతో సేవ చేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఆయన రోజుకు 17 గంటల పాటు కష్టపడే నాయకుడు అని కితాబు ఇచ్చారు. తమ ప్రభుత్వం మీద సభకు విశ్వాసం ఉంది, ప్రజలకు అంతకంటే ఎక్కువగా ఉంది. విపక్షాల రాజకీయం ఏంటో అంతా చూస్తున్నారు అని అన్నారు. తాము అవిశ్వాస తీర్మానాన్ని స్వాగతిస్తామని రాజ్యాంగం లో ఇది ఒక ప్రక్రియగా చూస్తామని అమిత్ షా అన్నారు. బీజేపీని కేంద్రాన్ని విపక్షాలు చూస్తున్నది జస్ట్ ఒక ట్రైలర్ గా మాత్రమే అసలు సినిమా ముందుంది అంటూ అమిత్ షా లాస్ట్ పంచ్ వేసరు. మొత్తానికి అమిత్ షా స్పీచ్ అంతా విపక్షాల మీద విమర్శలతో హాట్ హాట్ గా సాగింది.