Begin typing your search above and press return to search.

అమిత్ షాకు " కశ్మీర్‌ యాపిల్" సవాల్... కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు

ఈ మేరకు జమ్మూ కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ), జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టారు

By:  Tupaki Desk   |   7 Dec 2023 11:30 PM GMT
అమిత్  షాకు  కశ్మీర్‌  యాపిల్ సవాల్... కాంగ్రెస్  ఘాటు వ్యాఖ్యలు
X

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రాంతానికి 24 సీట్లు రిజర్వు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పీఓకే కూడా భారత భూభాగమే కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ), జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లులను లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నుంచి ఘాటు రియాక్షన్ వచ్చింది.

అవును... లోక్‌ సభలో పాక్‌ ఆక్రమిత్‌ కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ... భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కశ్మీర్‌ దుస్థితికి నెహ్రూ చేసిన రెండు తప్పిదాలే కారణమంటూ షా వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ఈ క్రమంలో... "పీవోకే కంటే ముందు అక్కడి నుంచి ఒక యాపిల్‌ ను తీసుకురండి" అంటూ సవాల్‌ విసిరింది.

ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి... దివంగత నేత నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో పీవోకే అంశంపై ఒక రోజంతా కచ్చితంగా చర్చ జరపాలని.. అమిత్‌ షా చెబుతునట్లు నెహ్రూ తప్పు చేశారనే అనుకుంటే... 2019లో పీఓకేని వెనక్కి తీసుకువస్తామని కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని.. దాన్ని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా మీదుగా అనుసంధాన కారిడార్‌ ఏర్పాటు చేసిన “చైనా-పాక్ ఎకానమిక్‌ కారిడార్‌” (సీపెక్‌) ప్రాజెక్ట్‌ నిర్మాణం కొనసాగుతోందని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలో ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందంటూ ఆయన దుయ్యబట్టారు.

ఈ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికల లోగా పీఓకేను వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ... అలా జరిగితే దేశంలోని అన్ని ఓట్లను బీజేపీనే పొందవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా గట్టిగా మాట్లాడితే... పీవోకేను వెనక్కి తీసుకురావడం అంటుంచి ముందు కనీసం ఒక యాపిల్‌ ను అక్కడ నుంచి తీసుకురండి అంటూ సవాల్‌ విసిరారు. దీంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కాగా... జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లులను కేంద్రం బుధవారం లోక్‌ సభలో ప్రవేశపెట్టగా.. అవి ఆమోదింపబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా... కశ్మీర్‌ మొత్తాన్ని గెలుచుకోక ముందే నెహ్రూ కాల్పుల విరమణ ప్రకటించడం ఒక తప్పైతే.. అక్కడి ప్రజల బాధలను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లకపోవడం మరో తప్పిదమంటూ ఆరోపించారు.