Begin typing your search above and press return to search.

మాకు 6 వేల కోట్లే.. విపక్షాలకు 14 వేలకోట్లు.. బాండ్లపై షా వింత లెక్క

దీనికి కేంద్రం హోం మంత్రి అమిత్ షా మాత్రం తనదైన శైలిలో లెక్క చెప్పారు.

By:  Tupaki Desk   |   16 March 2024 7:41 AM GMT
మాకు 6 వేల కోట్లే.. విపక్షాలకు 14 వేలకోట్లు.. బాండ్లపై షా వింత లెక్క
X

మంచికో.. చెడుకో.. సుప్రీం కోర్టు చలవతో ఎలక్టోరల్ బాండ్ల పుట్ట బద్ధలైంది. ఏ పార్టీకి ఎన్ని విరాళాలు బాండ్ల రూపంలో వచ్చిందో వెల్లడైంది. అత్యధికంగా లబ్ధి పొందింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపే అని స్పష్టమైంది. అంతేకాక.. లాటరీ కింగ్ గా పేరుగాంచి.. ఈడీ, సీబీఐ కేసులున్న శాంటియాగో మార్టిన్ వంటి వ్యక్తి ఏకంగా రూ.1,368 కోట్లు విరాళం ఇచ్చినట్లు స్పష్టమైంది. అయితే, 2019 నుంచి అన్ని పార్టీలకు రూ.20 వేల కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో బాండ్ల రూపంలో వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో రూ.6 వేలకోట్ల బాండ్లు పొందిన బీజేపీని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. దీనికి కేంద్రం హోం మంత్రి అమిత్ షా మాత్రం తనదైన శైలిలో లెక్క చెప్పారు.

30శాతంపైగా ఒక్కపార్టీకే..

మొత్తం రూ.20వేల కోట్ల ఎన్నికల బాండ్లలో బీజేపీకి రూ.6 వేల కోట్లు,

టీఎంసీకి రూ.1,600 కోట్లు, కాంగ్రెస్‌ కు రూ.1,400 కోట్లు అందాయి. మిగతా పార్టీలకూ కొంత అందాయి. అంటే.. బీజేపీకే 30శాతంపైగా నిధులు వచ్చాయి. కానీ, దీన్ని అమిత్ షా మరోలా చెబుతున్నారు. 303 మంది ఎంపీలున్న బీజేపీకి రూ.6 వేల కోట్లు వస్తే.. 242 మంది ఎంపీలున్న విపక్షాలకు రూ.14వేల కోట్లు దక్కాయని అంటున్నారు. అయినప్పటికీ ఏడుపు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. లెక్కలన్నీ తేలితే.. విపక్షాలు ప్రజలకు ముఖం చూపించలేవని మండిపడ్డారు.

అనేక విపక్షాలు.. ఒక్కటే బీజేపీ

అధికారంలో ఉండి మొత్తం విరాళాల్లో 30 శాతం పైగా పొందడాన్ని షా సమర్థించుకుంటున్నారు. అయితే, పదుల సంఖ్యలోని మిగతా విపక్షాలు అన్నిటికీ కలిపి వచ్చిన మొత్తాన్ని ఆయన చూపుతున్నారు. ఇది ఏవిధంగా సమర్థనీయం? అనేది ప్రశ్న. ఎన్నికల బాండ్ల పథకం కుంభకోణం అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బదులిస్తూ ఆయన చేసిన విశ్లేషణ తర్కానికి అందడం లేదు. ఒకవేళ బీజేపీ అధికారంలో లేకుంటే ఈ స్థాయిలో బాండ్లు వచ్చేవా? అనే ప్రశ్న వస్తోంది. మరోవైపు బాండ్లను అత్యధికంగా ఆ పార్టీకే ఇవ్వడానికి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం అనే ఆరోపణ కూడా ఉండడం గమనార్హం.

కాగా.. ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా గౌరవిస్తామని అమిత్ షా తెలిపారు. కానీ, రద్దు చేయడానికి బదులుగా మెరుగుపర్చే అవకాశం ఇస్తే బాగుండేదన్నారు.