Begin typing your search above and press return to search.

దేశంలోనే రెండో అత్యంత శక్తివంతుడైన నేత.. సొంత కారు కూడా లేదట!

అమిత్‌ షా.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేంద్ర హోం శాఖ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు

By:  Tupaki Desk   |   20 April 2024 8:47 AM GMT
దేశంలోనే రెండో అత్యంత శక్తివంతుడైన నేత.. సొంత కారు కూడా లేదట!
X

అమిత్‌ షా.. గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేంద్ర హోం శాఖ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ, ఇటు బీజేపీ జాతీయ స్థాయిలో కానీ నరేంద్ర మోదీ తర్వాత రెండో స్థానం ఎవరిదంటే అంతా చెప్పే పేరు.. అమిత్‌ షాదే. దేశాన్ని కాంగ్రెస్‌ ముక్త రహితంగా మార్చడానికి కంకణం కట్టుకున్న మోదీ–షా వేస్తున్న ఎత్తులు మామూలువి కాదు.

అలాంటి దేశంలోనే రెండో అత్యంత శక్తివంతుడైన నేత అయిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సొంత కారు లేదట. నమ్మలేకపోతున్నారా.. ఇది నిజంగా నిజం. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే తన ఎన్నికల అఫిడవిట్‌ లో వెల్లడించారు.

గుజరాత్‌ లోని గాంధీనగర్‌ స్థానానికి అమిత్‌ షా ఎంపీగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అమిత్‌ షా గాంధీనగర్‌ నుంచే తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయనపైన కాంగ్రెస్‌ పార్టీ తరఫున మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోనాల్‌ పటేల్‌ పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి మే 7న పోలింగ్‌ జరగనుంది.

ఈ సందర్భంగా ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసిన అమిత్‌ షా అఫిడవిట్‌ లో తన చర, స్థిరాస్తులు, అప్పులు వివరాలను వెల్లడించారు. అయితే ఇప్పటివరకు తనకు సొంత కారు లేదని పేర్కొనడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

కేంద్ర హోం మంత్రి, దేశంలోనే రెండో అత్యంత శక్తివంతుడైన నేత అయిన అమిత్‌ షాకు కారు లేదంటే ఎవరికైనా నమ్మడం కష్టమే. అయితే ఆయన తనకు కారు లేదని ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కొన్నారు.

కాగా తనకు మొత్తం రూ.36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు అమిత్‌ షా తెలిపారు. ఇందులో రూ.20 కోట్ల చర ఆస్తులు ఉండగా రూ.16 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

అలాగే అమిత్‌ షా తన సతీమణికి రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అమిత్‌ షా అఫిడవిట్‌ లో వెల్లడించారు. తనకు రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, తన సతీమణికి రూ.1.10 కోట్ల విలువైన నగలున్నాయని పేర్కొన్నారు.

ఇక అప్పుల విషయానికొస్తే అమిత్‌ షాకు రూ.15.77లక్షల అప్పులు ఉన్నాయి. ఆయన సతీమణి సోనాల్‌ పేరు మీద రూ. 26.32 లక్షల రుణం ఉందని అఫిడవిట్‌ లో వెల్లడించారు.

ఇక 2022–23లో అమిత్‌ షా తన వార్షికాదాయం రూ.75.09 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. తన సతీమణి వార్షికాదాయం రూ.39.54 లక్షలుగా ఉందన్నారు.

ఎన్నికల అఫిడవిట్‌ లో తాను వృత్తిరీత్యా రైతునని, సామాజిక కార్యకర్తనని అమిత్‌ షా వెల్లడించడం గమనార్హం. కాగా ఆయనపై మూడు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.