Begin typing your search above and press return to search.

భద్రతా వైఫల్యంపై అమిత్ షా వివరణ అడిగితే.. 92 మంది సస్పెన్షనా?

అమిత్ షా వివరణ కోసం పట్టుబట్టటం నేరమన్నట్లు.. మహా ఘోరమన్నట్లుగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్న వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 4:34 AM GMT
భద్రతా వైఫల్యంపై అమిత్ షా వివరణ అడిగితే.. 92 మంది సస్పెన్షనా?
X

వెల్ లోకి దూసుకు రాలేదు. నానా రచ్చ చేయలేదు. స్పీకర్ పోడియంను చుట్టుముట్ట లేదు. స్పీకర్ కుర్చీని తోసేయలేదు. పత్రాల్ని చించేయటం.. ఇలాంటివేమీ చేయలేదు. వారు చేసిందల్లా.. అత్యంత భద్రతో ఉన్న పార్లమెంటులోకి నిరసన పేరుతో ఆరాచకాన్నిక్రియేట్ చేసి.. పార్లమెంటు భద్రతలోని లోపాల్ని .. డొల్లతనాన్ని ఎత్తి చూపిన ఉదంతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు వచ్చి.. సభలోని సభ్యులకు వివరణ ఇవ్వాలని కోరారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

భారతదేశ చరిత్రలో పార్లమెంటు భవనంలోకి అరాచక శక్తులు ఎంట్రీ ఇవ్వటం ఒక ఎత్తు అయితే.. ఏకంగా సభలోకి దూసుకొచ్చి.. సభ్యుల మధ్య చేసిన రచ్చ ఎంతో అందరికి తెలిసిందే. ఇలాంటి అరుదైన ఉదంతంలో భద్రతా వ్యవస్థలోని లోపాలు కళ్లకు కట్టినట్లుగా కనిపించాయి. అంతేకాదు.. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చే అవకాశం ఉండటం ఏమిటి? నిఘా వర్గాలు.. భద్రతా వర్గాలు ఏం చేస్తున్నట్లు? అన్నది ప్రాథమిక ప్రశ్న.

ఇదే విషయాన్ని విపక్షానికి చెందిన ఎంపీ లోక్ సభ.. రాజ్యసభల్లో ప్రస్తావించటం.. అమిత్ షా వివరణ కోసం పట్టుబట్టటం నేరమన్నట్లు.. మహా ఘోరమన్నట్లుగా మోడీ సర్కారు వ్యవహరిస్తున్న వైనం షాకింగ్ గా మారింది. సభను సజావుగా జరగకుండా అడ్డుకున్నారన్న కారణంగా ఇప్పటికే పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసిన వైనం మర్చిపోక ముందే.. సోమవారం ఉభయ సభలకు చెందిన ఎంపీలను సస్పెన్షన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో.. ఒకే ఉదంతంపై 92 మంది ఎంపీల్ని శీతాకాల సమావేశాల వరకు బహిష్కరిస్తున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

లోక్ సభలో సస్పెన్షన్ వేటు పడిన వారిలో 10 మంది డీఎంకేకు చెందిన వారు.. తొమ్మిది మంది టీఎంసీకి చెందిన ఎంపీలు కాగా.. ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. స్పీకర్ పోడియం వద్ద చేరుకొని నినాదాలు చేసిన సభ్యులు ముగ్గురు మాత్రమే. వారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. రాజ్యసభలో కార్యక్రమాల్ని అడ్డు తగులుతున్నారన్నకారణంగా 45 మంది ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెన్షన్ కు గురయ్యారు. వీరిలో 12 మంది కాంగ్రెస్.. ఏడుగురు టీఎంసీ.. నలుగురు డీఎంకే సభ్యులు ఉన్నారు. 45 మందిలో 34 మందిని ప్రస్తుత శీతాకాల సబమావేశాల్లోని మిగిలిన సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు.

మిగిలిన 11 మంది సభలో ప్రవర్తించిన తీరుపై విచారణ జరిపి మూడునెలల్లో నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ ఛైర్మన్ ఆదేశించారు. అంటే.. వీరు మరో మూడు నెలల వరకు సభకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. అధికారపక్షం బాధ్యతగా స్పందించని పక్షంలో వారి తీరు సంగేతంటి? అన్నది ప్రశ్న. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ.. వారి నుంచి సమాధానం రాబట్టేందుకు ఆందోళన చేయటం సస్పెండ్ చేసే వరకు వెళ్లటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఇదంతా చూస్తున్న వారికి మోడీ రాజ్యంలో అమిత్ షాను సభకు వచ్చి వివరణ ఇవ్వాలని కోరటం ఇంత నేరమా? అన్నది ప్రశ్నగా మారింది.