Begin typing your search above and press return to search.

'వాళ్ల‌ను' స‌మ‌ర్థించినా.. మూల్యం త‌ప్ప‌దు: అమిత్ షా వార్నింగ్‌

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. లోక్‌స‌భ వేదిక‌గా న‌క్స‌లిజాన్ని స‌మ‌ర్థించే వర్గాల‌కు భారీ వార్నింగ్ ఇచ్చారు.

By:  Garuda Media   |   30 March 2026 11:09 PM IST
వాళ్ల‌ను స‌మ‌ర్థించినా.. మూల్యం త‌ప్ప‌దు:  అమిత్ షా వార్నింగ్‌
X

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. లోక్‌స‌భ వేదిక‌గా న‌క్స‌లిజాన్ని స‌మ‌ర్థించే వర్గాల‌కు భారీ వార్నింగ్ ఇచ్చారు. న‌క్స‌లైట్ల‌ను ఈ నెల 31(మంగ‌ళ‌వారం)తో అంతం చేస్తామ‌న్న మాట‌ను నిల‌బెట్టుకున్నామ‌న్నారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా మావోయిస్టు ప్ర‌భావిత రాష్ట్రాల్లో వేలాది మంది న‌క్స‌లైట్లు.. లొంగిపోయార‌ని తెలిపారు. లొంగేది లేద‌న్న‌వారు.. అంత‌మ‌య్యార‌ని వ్యాఖ్యానిం చారు. మ‌రీ ముఖ్యంగా న‌క్స‌లిజాన్ని స‌మ‌ర్థించేవారు కూడా ప్ర‌మాద‌క‌ర‌మేన‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. న‌క్స‌లైట్ల‌ను స‌మ‌ర్ధించేవారు కూడా మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని గుర్తుపెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు.

కాంగ్రెస్‌పై నిప్పులు

దేశంలో మావోయిస్టుల‌ను మార్చి 31 నాటికి తుడిచి పెట్టేస్తామ‌న్న విష‌యంపై లోక్‌స‌భ‌లో కేంద్ర‌మే స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌ను ప్ర‌వేశ పెట్టింది. సోమ‌వారం జరిగిన చ‌ర్చ‌లోప‌లువురు స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం.. అమిత్‌షా చివ‌రిలో స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ గ‌త ప్ర‌భుత్వాల‌పై నిప్పులు చెరిగారు. మావోయిస్టుల ఉనికి పెరిగిపోవ‌డానికి కాంగ్రెస్ అవ‌లంభించి న విధానాలే కార‌ణ‌మ‌ని తెలిపారు. ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వారిని త‌మ‌కు అనుకూలంగా వాడుకుంద‌న్నారు. త‌ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్ప‌టికీ అభివృద్ధికి నోచుకోలేద‌ని చెప్పారు.

మీరు ఊహించ‌ని విష‌యం..

''మీరెవ‌రూ ఊహించ‌ని విష‌యాన్ని ఇప్పుడు చెబుతా. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌స్త‌ర్‌కు అధికారులు వెళ్లాలంటే హ‌డ‌లిపోయేవారు. క‌నీసం 100 మంది భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఉంటే త‌ప్ప వెళ్లే ప‌రిస్థితి లేదు. కానీ, ఇప్పుడు చిన్న‌పిల్ల‌లు అక్క‌డ రోడ్ల‌పై క్రికెట్ ఆడుకుంటున్నారు. స్కూళ్ల‌కు వెళ్తున్నారు. వారు న‌చ్చిన‌ట్టుగా జీవిస్తున్నారు. ఇది మీరు ఊహించ‌గ‌ల‌రా? కానీ.. వాస్త‌వం'' అని అమిత్ షా వెల్ల‌డించారు. ఇదంతా మావోయిస్టుల ఏరివేత కార్య‌క్ర‌మం ఆప‌రేష‌న్ `క‌గార్‌`తోనే సాకార‌మైంద‌ని ఆయ‌న వివ‌రించారు.

మీ క‌న్నీళ్లు కార్చుకోండి!

''కొంత మంది తెగ క‌న్నీరు కార్చారు అధ్య‌క్షా. మావోయిస్టులు మ‌నుషులు కాదా.. దేశ పౌరులు కాదా.. వారిపై యుద్ధం చేస్తారా? అని ప్ర‌శ్నించారు. నేను వారికి ఒక‌టే చెబుతున్నా.. మీ క‌న్నీళ్లు కార్చుకోండి. ఇదేస‌మ‌యంలో మావోయిస్టుల కార‌ణంగా వంద‌లాది గ్రామాల్లో ప్ర‌జ‌లుఅభివృద్ధికి దూరంగా ఉండ‌డాన్ని చూసి కూడా క‌న్నీళ్లు కార్చుకోండి. ఆయుధం ప‌ట్టుకుని.. పాల‌న చేస్తామంటూ..త‌ల‌లు తెగ‌న‌రుకుతూ.. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న‌వారి వ‌ల్ల న‌ర‌కం చూస్తున్న ప్ర‌జ‌ల‌ను చూసి క‌న్నీళ్లు కార్చుకోండి.`` అని అమిత్ షా త‌న‌దైన శైలిలో విజృంభించారు.