అమిత్ షా మాస్టార్ క్లాస్ తీసుకుంటారా ?
తెలంగాణా మీద కోటి ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. అంతే కాదు, ఎన్నికలు పెడితే తమదే అధికారం అన్నంత ధీమా కనబరుస్తోంది.
By: Tupaki Desk | 29 Jun 2025 9:46 AM ISTతెలంగాణా మీద కోటి ఆశలు పెట్టుకుంది కమలం పార్టీ. అంతే కాదు, ఎన్నికలు పెడితే తమదే అధికారం అన్నంత ధీమా కనబరుస్తోంది. దానికి కారణం 2024 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లు దక్కాయి. మరి ఈ ఎనిమిది ఎంపీ సీట్లను అసెంబ్లీ సీట్లతో హెచ్చిస్తే 56 సీట్లు అవుతాయి. దాంతో 2028లో తెలంగాణాలో అధికారం తమదే అని కేంద్ర బీజేపీ నాయకత్వం మురిసిపోతోంది.
అయితే గత ఏడాదిగా చూస్తే తెలంగాణాలో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం ఏమంత ఉత్సాహంగా లేదు అని అంటున్నారు. 2024 ఎన్నికల నాటితో పోలిస్తే గ్రాఫ్ బాగా తగ్గిందని నివేదికలు వెళ్ళడిస్తున్నాయి. దానికి కారణం తెలంగాణా బీజేపీ నాయకులు ఎవరికి వారుగా యమునా తీరుగా ఉండడమే అని అంటున్నారు.
నిజానికి బీజేపీకి గతంలో ఎన్నడూ లేని బలం తెలంగాణా ప్రజలు ఇచ్చారు. ఎనిమిది మంది ఎంపీలు అలాగే మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వీరిలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవిని పార్టీ ఇచ్చింది. ఇంత చేసినా బీజేపీని తెలంగాణా రాష్ట్రంలో పటిష్టం చేసేందుకు నాయకులు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అని అంటున్నారు.
అంతే కాదు ప్రతీ వారూ తామే సీనియర్లమనై తామే గొప్ప అని ఫీల్ అవుతున్నారు. దాంతోనే అసలు సమస్య వస్తోంది. ఇక గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ వైఖరి కూడా పార్టీకి ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా సొంత దారిలో ఆయన వెళ్తున్నారు అని అంటున్నారు.
ఇక సొంత పార్టీలో ఉండి ప్రత్యర్ధి పార్టీల నేతలను బహిరంగంగా పొగుడుతూ కొంతమంది నేతలు పార్టీ దృష్టిలో పడ్డారు అని అంటున్నారు. ఇలా తెలంగాణా బీజేపీ విషయంలో చూసుకుంటే అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉందని అన్నట్లుగా తయారు అయింది అని అంటున్నారు.
ఇక ఈ నెల 29న తెలంగాణా బీజేపీ అధ్యక్ష పదవి కోసం నోటిఫికేషన్ రిలీజ్ అవుతుది. జూఅలి 1న ఎన్నిక ఉంది. సరిగ్గా ఈ సమయంలో బీజేపీ పెద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణాకు వస్తున్నారు. ఆయన నిజమాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం స్థానికంగా జరిగే సభలో పాల్గొంటారు.
అనంతరం తిరిగి హైదారాబాద్ వచ్చి ఎయిర్ పోర్టులోనే కొంత సేపు తెలంగాణా బీజేపీ నేతలతో మాట్లాడుతారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణా కొత్త బీజేపీ ప్రెసిడెంట్ ఎవతో జాతీయ నాయకత్వం మదిలో మాట చెబుతారు అని అంటున్నారు. ఈ పదవిని యువతకు ఇస్తారా మహిళలకు ఇస్తారా లేక సీనియర్లకు ఇస్తారా అన్నది చర్చగా ఉంది.
అయితే ప్రధానంగా ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ల మధ్యనే పోటీ ఉంటుందని అంటున్నారు. అయితే ఎవరిని ఎంపిక చేసినా వర్గ పోరు లేకుండా పార్టీని ముందుకు తీసుకుని పోవాలని సూచిస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఎవరికి వారుగా ఉంటే కుదరదని పెద్దాయన పక్కాగా క్లాస్ తీసుకునే చాన్స్ ఉందని అంటున్నారు.
బీజేపీకి ఎంతో ఆశావహగా ఉన్న రాష్ట్రంలో వాతావరణాన్ని ఎవరు చెడగొట్టాలని చూసినా సహించేది లేదని ఒక హెచ్చరిక కూడా చేస్తారు అని అంటున్నారు. పార్టీ కోసం అంతా అన్నీ మరచి కృషి చేయాలని ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదని ఒక సందేశం ఇస్తారని అంటున్నారు. హైకమాండ్ కి అన్నీ తెలుసు అన్నీ తాను చూసుకుంటుందని ఎవరికి ఎపుడు ఏమి ఇవ్వాలో ఇస్తుందని కూడా అమిత్ షా చెబుతారు అని అంటున్నారు. మొత్తానికి అమిత్ షా ఈసారి తెలంగాణా టూర్ లో మాస్టార్ అవతారం ఎత్తుతారు అని అంటున్నారు.
