కూల్చేయండి.. దేశ భద్రత విషయంలో అమిత్ షా సంచలన ఆదేశాలు
రాజస్థాన్‌లోని బికినీర్ లో జరిగిన హై లెవల్ సెక్యూరిటీ రివ్యూ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
By: A.N.Kumar | 28 May 2026 11:58 AM ISTదేశ భద్రత విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశ సరిహద్దుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడమే లక్ష్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. దేశ సరిహద్దులకు ఆనుకుని ఉన్న 15 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా వెంటనే గుర్తించి కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండబోదని, జీరో టాలరెన్స్ పాలసీ అమల్లోకి తీసుకురావాలని అమిత్ షా హెచ్చరించారు.
రాజస్థాన్‌లోని బికినీర్ లో జరిగిన హై లెవల్ సెక్యూరిటీ రివ్యూ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, నకిలీ పత్రాల ముఠాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలను ఆధారంగా చేసుకుని స్మగ్లింగ్, చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకారం అందుతున్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్యాంకుల లావాదేవీలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కూడా అమిత్ షా అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద నగదు బదిలీలు, భారీ ఫండింగ్‌లు, విదేశీ మూలాల నుంచి వస్తున్న డబ్బు ప్రవాహాలపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే ఫేక్ కంపెనీల పేరుతో జరుగుతున్న అక్రమ ఆర్థిక వ్యవహారాలను వెలికితీయాలని, బోగస్ సంస్థల ద్వారా నడుస్తున్న నిధుల మార్పిడిపై దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇక నకిలీ ఆధార్ కార్డుల వ్యవహారంపై కూడా కేంద్ర హోంమంత్రి తీవ్రంగా స్పందించారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌లకు సూచించారు. స్థానిక పోలీసు యంత్రాంగం, ఇంటెలిజెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రతి అనుమానాస్పద వ్యక్తిపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో భూకబ్జాలు, అక్రమ స్థలాల ఆక్రమణలు, అనధికార కాలనీల ఏర్పాటును పూర్తిగా అరికట్టాలని సూచించారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, అవసరమైతే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్తులో సరిహద్దు ప్రాంతాల్లో భారీ స్థాయిలో తనిఖీలు, కూల్చివేతలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
