Begin typing your search above and press return to search.

పాక్ గొంతు ఎండే భారత్ ప్లాన్.. బయటపెట్టిన అమిత్ షా

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 12:43 PM IST
పాక్ గొంతు ఎండే భారత్ ప్లాన్.. బయటపెట్టిన అమిత్ షా
X

భారత్‌-పాక్‌ల మధ్య 1960లో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఇకపై పునరుద్ధరించే ప్రశ్నే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దానికి తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని పేర్కొన్నారు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదు. కానీ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్‌కు ఉంది. అదే చేసాం. ఈ ఒప్పంద పీఠికలో రెండు దేశాల శాంతి, పురోగతిని ప్రస్తావించారు. కానీ పాక్‌ పదే పదే ఉల్లంఘనలు చేస్తూ ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది’’ అని అన్నారు.

-పాకిస్థాన్‌కు నీటి కొరత తప్పదు

అమిత్ షా పేర్కొన్నట్లుగా.. ఇన్నాళ్లూ భారత్‌లో ప్రవహించి, పాక్‌కు చేరే నీటిని అక్కడివారు అన్యాయంగా వినియోగించుకుంటున్నారు. ఇకపై అలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ‘‘భారత్‌కు హక్కుగా ఉన్న నీటిని దేశ అవసరాలకు వినియోగించుకుంటాం. కెనాల్ నిర్మించి ఆ నీటిని పాక్‌ వైపు కాకుండా రాజస్థాన్‌కు మళ్లిస్తాం. దీంతో పాకిస్థాన్‌ గొంతు ఎండాల్సిందే’’ అన్నారు.

- పాక్‌ పరిస్థితి విషమం!

భారత్ చర్యలతో పాక్‌కు తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. సింధూ జలాలపై ఆ దేశ వ్యవసాయం 80 శాతం ఆధారపడి ఉంది. పైగా ఆ జలాల ద్వారానే ఆ దేశ జీడీపీకి 25 శాతం వసూళ్లు లభిస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌ తాజా నిర్ణయం పాక్‌ వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసే అవకాశముంది.

-2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలే!

ఇదే సందర్భంలో అమిత్‌ షా మరో కీలక ప్రకటన చేశారు. ‘‘2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతోనే జరుగుతాయి. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందింది’’ అని తెలిపారు.

-పునర్విభజనపై స్పష్టత

నియోజకవర్గాల పునర్విభజనపై స్పందిస్తూ ‘‘ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అన్ని అంశాలను సమతుల్యంగా పరిగణనలోకి తీసుకుంటాం. డీఎంకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీనికి వ్యతిరేకత చూపుతోంది. కానీ రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.

పాక్‌కు ఎదురయ్యే నీటి కొరత, భారత ఆత్మరక్షణ చర్యలు, మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన తదితర కీలక అంశాలపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.