సోలో ఫైట్ సో బెటర్...బీజేపీ షాకింగ్ డెసిషన్ !
ఒంటరి పోరుకే తాము మొగ్గు చూపుతున్నట్లుగా బీజేపీ అగ్ర నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
By: Satya P | 11 Jun 2026 8:45 AM ISTఒంటరి పోరుకే తాము మొగ్గు చూపుతున్నట్లుగా బీజేపీ అగ్ర నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన ఈ బిగ్ ట్విస్ట్ తో తెలంగాణాతో పాటు బీజేపీతో పొత్తులో ఉన్న రాష్ట్రాలలో కూడా ఒకింత చర్చ మొదలైంది. అయితే తెలంగాణా పంజాబ్ లలో ఒంటరి పోరు అని అమిత్ షా క్లారిటీగా చెప్పారు. పంజాబ్ లో అయితే 2027 లో ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణాలో 2028 లో ఉన్నాయి. ఇక దక్షిణాది మీద తన ఫోకస్ మరింత పెంచుతామని కూడా ఆయన చెప్పారు. అంటే 2028 లోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జేడీఎస్ తో బీజేపీకి పొత్తు ఉంది. అలాగే ఏపీలో 2029 లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ టీడీపీ జనసేనతో పొత్తు ఉంది. మరి ఈ రాష్ట్రాలలో బీజేపీ ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది.
మిత్రులను గౌరవిస్తూనే :
అయితే బీజేపీ వ్యూహాలను కూడా అంత సులువుగా ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. ఏపీలో బీజేపీకి సొంతంగా పోటీ చేసే బలం అయితే లేదు. పైగా 2029 లో బీజేపీ వరసగా నాలుగో సారి అధికారంలోకి రావాలీ అంటే మిత్రుల సాయం కావాలి. అందువల్ల ఏపీలో పొత్తులు కచ్చితంగా కొనసాగుతాయని అంటున్నారు. అదే సమయంలో కర్ణాటకలో కూడా మాజీ ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెబుతున్నారు. ఇక తెలంగాణా విషయమే ఇపుడు మరింత చర్చగా మారుతోంది.
బీఆర్ఎస్ తో లేనట్లే :
ఇంతకాలం బీజేపీ బీఆర్ఎస్ కలసి పొత్తు పెట్టుకుని వస్తాయని కాంగ్రెస్ నేతలు అంటూ వచ్చారు. కానీ ఇపుడు చూస్తే అది కాదని అమిత్ షానే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి 2028 ఎన్నికలకు బీజేపీ సోలోగానే ఫైట్ ఇస్తుందని అంటున్నారు. బీజేపీకి 2024 ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లు జనాలు ఇచ్చారు. మరి దీనిని అసెంబ్లీకి కన్వర్ట్ చేస్తే కనుక 63 సీట్లు వస్తాయి అంటే అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ వచ్చేసినట్లే. సరిగ్గా బీజేపీ ఇదే దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన చేసింది అని అంటున్నారు. తమ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్ల మీద ఫుల్ ఫోకస్ పెడితే చాలు రేపటి తెలంగాణాలో అధికారం తమకే దక్కుతుందని లెక్క వేస్తోంది అని అంటున్నారు.
బీఆర్ఎస్ కి షాక్ :
ఇక బీజేపీ కనుక గట్టిగా తీర్మానించుకుంటే ఆ ఎత్తులు వ్యూహాలు వేరే లేవెల్ అని చెప్పాల్సిందే. దానికి పశ్చిమ బెంగాల్ లేటెస్ట్ ఉదాహరణగా చెబుతారు. అక్కడ బీజేపీ మొదట లెఫ్ట్ పార్టీలను కాంగ్రెస్ ని సైడ్ చేసి ముందుకు వచ్చి ఇపుడు ఏకంగా అధికారం పట్టేసింది అదే తీరున తమకు బలం ఉన్న తెలంగాణాలో బీజేపీ గట్టిగానే చొచ్చుకుని పోయే ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు. దాంతో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఆ జోరుని అందుకోవాల్సి ఉంటుంది. బీజేపీతో పోటీ పడాల్సి ఉంటుంది. బీజేపీకి జాతీయ స్థాయిలో అపరిమితమైన బలంతో పాటు కేంద్రంలో అధికారం కూడా ఉంది. దాంతో బీజేపీ కనుక డైరెక్ట్ ఫైట్ కి దిగితే అది కాస్తా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తెలంగాణాలో మార్చగలదు. అపుడు రెండు జాతీయ పార్టీల మధ్య పోరులో బీఆర్ఎస్ కి స్పేస్ తగ్గిపోయే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద ఒంటరి పోరు అని బీజేపీ ఇచ్చిన ప్రకటన గులాబీ పార్టీలో గుబులు పుట్టించే లాగానే ఉంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ అయితే ఇప్పటికే బీజేపీని గట్టిగా టార్గెట్ చేస్తోంది.
