Begin typing your search above and press return to search.

బెంగాల్ లో అమిత్ షా గర్జన.. మమత సర్కారు సవాల్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణరంగం ఆసక్తికరంగా మారుతోంది. అధికార టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

By:  Tupaki Political Desk   |   2 April 2026 11:00 PM IST
బెంగాల్ లో అమిత్ షా గర్జన.. మమత సర్కారు సవాల్
X

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణరంగం ఆసక్తికరంగా మారుతోంది. అధికార టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ మధ్య పోటీ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. బెంగాల్ గద్దెపై పదేళ్ల నుంచి కన్నేసిన బీజేపీ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే పట్టుదల ప్రదర్శిస్తోంది. నామినేషన్ల కార్యక్రమం నుంచి ఎన్నికల వరకు బీజేపీ అగ్రనేతలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరయ్యారు. ఈ సారి సువేందును బెంగాల్ ముఖ్యమంత్రిగా చేస్తానని, అంతవరకు తాను బెంగాల్ లోనే ఉంటానని అమిత్ షా ప్రకటించారు.

బెంగాల్ లో అమిత్ షా ప్రకటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీని గద్దె దించుతామని అమిత్ షా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తాను 15 రోజులు బెంగాల్ లోనే ఉంటానని, సువేందు అధికారికి మద్దతుగా ప్రచారం చేస్తానని అమిత్ షా ప్రకటించారు. గత ఎన్నికల్లో మమతను ఎమ్మెల్యేగా ఓడించిన సువేందు ఈ సారి కూడా నందిగ్రాం నుంచి పోటీ చేస్తున్నారు. గురువారం భారీ ర్యాలీ చేసిన అనంతరం అమిత్ షా సమక్షంలో సువేందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.

సువేందు అధికారి నామినేషన్ కోసమే తాను ప్రత్యేకంగా బెంగాల్ వచ్చానని అమిత్ షా వెల్లడించారు. సువేందు విజయం బెంగాల్ మార్పునకు పునాది వేస్తుందన్నారు. గత సారి నందిగ్రామ్ లో ఓడిన మమతా బెనర్జీ ఈ సారి భవానీపూర్ తోపాటు యావత్ బెంగాల్ లో ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. బెంగాల్ లో మమత పతనానికి ఈ రోజు నాంది పలుకుతున్నట్లు అమిత్ షా అన్నారు. ఈ సారి సువేందును భారీ మెజార్టీతో గెలిపించి బెంగాల్ చరిత్రను పునరావృతం చేసి మమతా బెనర్జీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

తాను బెంగాల్ మొత్తం పర్యటించానని, వెళ్లిన ప్రతి చోటా ఒకే స్వరం వినిపిస్తోందని చెప్పారు. మమతా బెనర్జీకి వీడ్కోలు పలకండి. ప్రభుత్వానికి వీడ్కోలు పలకండి, మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పండి అంటూ ఒకే నినాదం మార్మోగుతోందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. టీఎంసీ పాలనలో దోపిడీ, గుండాయిజంతో బెంగాల్ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని వ్యాఖ్యానించారు. తరచుగా జరుగుతున్న బాంబు పేలుళ్లు, నిరుద్యోగంతో యవత ఎదుర్కొంటున్న ఇబ్బందులు టీఎంసీ పాలనలో అధ్వాన స్థితికి అద్దం పడుతున్నాయన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్న మమత సర్కారు రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మార్చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని, అభివృద్ధిని తీసుకువస్తామని, బెంగాల్ వైభవాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.