Begin typing your search above and press return to search.

అమెరికాలో ఆ వీసాల ధరలకు రెక్కలు

ఈ నేపథ్యంలోనే తాజాగా H1-B, L-1, EB-5 వీసాలపై అమెరికా రావాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. ఆ వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచేసింది.

By:  Tupaki Desk   |   31 March 2024 6:41 AM GMT
అమెరికాలో ఆ వీసాల ధరలకు రెక్కలు
X

తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు చాలా దేశాల నుంచి విద్యావంతులు అమెరికాకు వెళుతుంటారు. ముఖ్యంగా ఇండియా, చైనాల నుంచి H1-B వీసాల మీద అమెరికాకు వెళ్లేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తమ ఉద్యోగాలను భారతీయులు, చైనావాళ్లు కొట్టేస్తున్నారని అమెరికావాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి టీసీఎస్ వంటి కంపెనీలు అమెరికన్లు ఫైర్ చేసి భారతీయులను హైర్ చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా H1-B, L-1, EB-5 వీసాలపై అమెరికా రావాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. ఆ వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచేసింది.

గత ఎనిమిదేళ్లలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 1, 2024 నుంచి పెరిగిన ధరలు అమలులోకి రాబోతున్నాయి. ఉదాహరణకు హెచ్1బి వీసా అప్లికేషన్ ధర గతంలో 460 డాలర్లు ఉండేది. ప్రస్తుతం అది 780 డాలర్లకు చేరింది.

ఇక, ఎల్ వన్ వీసా 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులపై భారం పడనుంది. మరోవైపు, ఈబి ఫైవ్ వీసా ఫీజు కూడా 3675 డాలర్ల నుంచి 11160 డాలర్లకు చేరుకుంది.

ఈ వీసా ఫీజుల పెరుగుదల ముఖ్యంగా భారతీయులపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సిఐఎస్) ఈ ధరల పెరుగుదలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇమిగ్రేషన్ పాలసీలు, విధివిధానాలు అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ఈ వీసా ధరల పెరుగుదల ప్రభావం చూపించే అవకాశముంది. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కూడా వీసా సేవలలో మార్పులతోపాటు వీసా ఫీజులలో మార్పులు చేర్పులకు పలు సూచనలు చేసింది. ఈ ధరల పెరుగుదల ముఖ్యంగా భారత్, చైనా నుంచి హెచ్1బీ వీసాల ద్వారా అమెరికాలోకి సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వచ్చే వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.