Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షుడయ్యేది ఎవరు.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ డెమోక్రటిక్‌ పార్టీ తరఫున, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Feb 2024 4:34 AM GMT
అమెరికా అధ్యక్షుడయ్యేది ఎవరు.. సర్వేలు ఏం చెబుతున్నాయి?
X

ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మనదేశంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నట్టు అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి దేశ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ డెమోక్రటిక్‌ పార్టీ తరఫున, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీ తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా పోటీలో ఉన్నారు. కాగా అమెరికా అధ్యక్ష పదవి కోసం గట్టిగా పోటీపడ్డ భారతీయ సంతతి అభ్యర్థి వివేక్‌ రామస్వామి చివరకు బరిలో నుంచి తప్పుకున్నారు. ఆయన తన మద్దతును డోనాల్డ్‌ ట్రంప్‌ కు ప్రకటించారు.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తాజా సర్వే ఒకటి వెలువడింది. తాజాగా విడుదలయిన గాల్లప్‌ పోల్‌ లో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ను తిరిగి 38 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. ఇక డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు కావాలని ఏకంగా 50 శాతం మంది కోరుకుంటున్నారని సర్వే తేల్చింది.

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కు ఆయన వయసే పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం బైడెన్‌ వయసు 81 ఏళ్లు. అమెరికా చరిత్రలోనే పెద్ద వయసు అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. బైడెన్‌ అధిక వయసు వల్లే రెండోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు చాలా మంది అంగీకరించడం లేదని గాల్లప్‌ సర్వే తేల్చింది. వయసే ఆయనకు పెద్ద ప్రతిబంధకంగా మారుతుందని పేర్కొంది. వయసుతో పాటు మెక్సికోతో సరిహద్దు వివాదం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలు బైడెన్‌ కు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయని సర్వే తేల్చింది.

కాగా డోనాల్డ్‌ ట్రంప్‌ కు కూడా వయసు సమస్య ఉంది. ఆయనకు ఇప్పుడు 77 ఏళ్లు. దీంతో ట్రంప్‌ వయసుపై కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ బైడెన్‌ తో పోల్చినపుడు వయసు విషయంలో సర్వేల్లో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు.

అయితే గతంలో గాల్లప్‌ పోల్స్‌ అంచనాలు చాలాసార్లు గురితప్పాయి. దీంతో ఈ సర్వేను అంతగా నమ్మాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3న జరిగిన సౌత్‌ కరోలినా డెమోక్రాటిక్‌ ప్రైమరీలో జో బైడెన్‌ విజయం సాధించారు. దాదాపు 55 మంది డెలిగేట్‌లు పోటీలో ఉన్నప్పటికీ తొలి నుంచి బైడెన్‌ దే విజయమని అంతా భావించారు. అనుకున్నట్టుగానే బైడెన్‌ కే విజయం దక్కింది. ఆయన ఇప్పటికే సౌత్‌ కరోలినా ప్రైమరీలో విజయం సాధించారు.