Begin typing your search above and press return to search.

అదరగొట్టేస్తున్న వివేక్ రామస్వామి.. గంటలో అంత భారీగా విరాళాలు

వివేక్ రామస్వామి. ఇదే పేరును గతంలో ప్రస్తావిస్తే.. ఎవరీయన? అన్న ప్రశ్న రాక మానదు. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది

By:  Tupaki Desk   |   26 Aug 2023 5:46 AM GMT
అదరగొట్టేస్తున్న వివేక్ రామస్వామి.. గంటలో అంత భారీగా విరాళాలు
X

వివేక్ రామస్వామి. ఇదే పేరును గతంలో ప్రస్తావిస్తే.. ఎవరీయన? అన్న ప్రశ్న రాక మానదు. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ(మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రాతినిధ్యం వహించే పార్టీ) తరఫున బరిలోకి నిలుస్తానని ప్రకటించారో.. అప్పటి నుంచి ఆయన పేరు మారుమోగుతోంది. దీనికి తగ్గట్లే ఆయన ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ బరిలోకి దిగాలని తెగ ప్రయత్నిస్తున్న వేళ.. ఆయనకు పోటీగా అదే పార్టీ నుంచి ఎన్నికల సీన్లోకి వచ్చిన ఆయన.. మరోసారి వార్తల్లో నిలిచారు.

గురువారం రిపబ్లికన్ పార్టీ చర్చ ముగిసిన గంటలోనే.. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా పలువురు విరాళాలు అందించారు. ఈ మొత్తాన్ని మన రూపాయిల్లో లెక్క వేస్తే.. అక్షరాల రూ.3.71 కోట్ల మొత్తాన్ని విరాళంగా అందుకున్నారు. ఆయన వాగ్దాటి అందరిని మంత్రముగ్దుల్ని చేయటంతో పాటు.. ఆయన్ను అభిమానించే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు వీలుగా ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అక్కడి ఒపీనియన్ పోల్స్ లో ట్రంప్ టాప్ పొజిషన్లో ఉంటే.. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్ తర్వాత ఉన్నది వివేక్ రామస్వామినే. అయితే.. ఇటీవల కాలంలో ట్రంప్ వివిధ కార్యక్రమాలకు గైర్హాజరు అవుతున్నారు. వివేక్ రామస్వామికి ఇదో అడ్వాంటేజ్ గా మారింది.

వివేక్ రామస్వామి వాగ్దాటి గురించి పలు మీడియా సంస్థలు పాజిటివ్ గా రియాక్టు అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ లాంటి మీడియా సంస్థలు సైతం వివేక్ తీరును.. మాటను ప్రశంసిస్తున్నాయి. అతగాడి వాదనా పటిమతో మిగిలిన వారంతా తేలిపోయినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. ఇదేమీ రిపబ్లిక్ పార్టీ షో మాదిరి కాకుండా వివేక్ రామస్వామ షోలా మారిందని పేర్కొనటం గమనార్హం.

తాజాగా జరిపిన చర్చలో 28 శాతం రామస్వామి తరఫున నిలువగా.. 27 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్ కు మద్దతుగా నిలిచారు. మరోవైపు అభ్యర్థి రేసులో ఉన్న భారత మూలాలు ఉన్న మహిళా నేత నిక్కీ హేలీకి కేవలం ఏడు శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంటే.. వివేక్ రామస్వామి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దేశాధ్యక్ష పదవికి అభ్యర్థిత్వ పరీక్షలో రిపబ్లికన్ పార్టీ తరఫున చివరకు నిలిచేది తాను.. ట్రంప్ మాత్రమే అంటూ వివేక్ చెబుతున్న మాటలు.. అతగాడి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపంగా నిలుస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.