అమెరికా కలకు ఇప్పుడు టికెట్ రూ.95 లక్షలు.. అయినా క్యూ మాత్రం తగ్గట్లేదు!
అమెరికన్ డ్రీమ్ కోసం భారతీయులు పడుతున్న ఆరాటం ఇప్పుడు మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది.
By: A.N.Kumar | 3 Jun 2026 6:00 PM IST‘‘అమెరికా వెళ్తే లైఫ్ సెటిల్" అనే రోజులు పోయాయి. "అమెరికా వెళ్లాలంటే ముందు ఇల్లు అమ్మాలి" అనే పరిస్థితి వచ్చేసింది. అమెరికన్ డ్రీమ్ కోసం భారతీయులు పడుతున్న ఆరాటం ఇప్పుడు మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల ప్రభావమో ఏమో కానీ హెచ్1బీ వీసా ఫాస్ట్ ట్రాక్ ప్రాసెసింగ్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ.95.6 లక్షలు) పెంచేశారు. అయినప్పటికీ మనవాళ్ల క్యూ మాత్రం తగ్గడం లేదు.
లక్షల్లో దరఖాస్తులు.. కోట్లలో ఫీజులు!
అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 2.86 లక్షల హెచ్1బీ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో షాకింగ్ విషయమేమిటంటే.. దాదాపు 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు "వీసా త్వరగా వస్తే చాలు" అంటూ రూ.95 లక్షల ప్రీమియం ఫీజును చెల్లించడానికి వెనకాడలేదు. మనదేశంలో ఇల్లు కొనేందుకు 20 ఏళ్లు ఈఎంఐ కట్టే మొత్తాన్ని అక్కడ కేవలం వీసా ప్రాసెసింగ్ కోసమే ముందుగా చెల్లిస్తుండటం గమనార్హం.
కథలో అసలు ట్విస్ట్ ఇదే..
ఫీజు కట్టేందుకు యువత సిద్ధంగా ఉన్నా అమెరికాలోని కంపెనీలు మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. ఈ భారీ ఫీజుల భారం భరించలేక చాలా సంస్థలు ఉద్యోగ ఆఫర్లను వెనక్కి తీసుకుంటున్నాయి. మరికొన్ని జాయినింగ్ డేట్లను వాయిదా వేస్తుండగా విదేశీ నియామకాలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. అంటే చేతిలో ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని అయోమయంలో కూడా అభ్యర్థులు లక్ష డాలర్లు సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది.
సెనేటర్ల ఆందోళన
ఈ భారీ ఫీజుల పెంపుపై అమెరికా సెనేటర్లు కూడా పెదవి విరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులు, పాఠశాలలు విదేశీ డాక్టర్లు, టీచర్లపైనే ఆధారపడుతున్నాయని ఈ నిర్ణయం వల్ల ఆయా రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
తగ్గేదే లే అంటున్న భారతీయులు
ఇన్ని సవాళ్లు ఉన్నా భారతీయ ఐటీ నిపుణులలో అమెరికా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడ కంపెనీల్లో బెంచ్ మీద కూర్చోవడం కంటే అక్కడ వీసా క్యూలో నిలబడటమే బెటర్ అనే ధోరణి కనిపిస్తోంది. మొత్తానికి అమెరికా కల ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. మరి ఇంత రిస్క్ చేసి రూ.95 లక్షలు కడితే వీసా చేతికి వస్తుందా? లేక కేవలం ఫీజు రసీదు మాత్రమే మిగులుతుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న!
