Begin typing your search above and press return to search.

ఈ ఫ్లైట్ లో ఉన్నోళ్లంతా మహా సుడిగాళ్లు.. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది

తాజా ఉదంతం గురించి తెలిస్తే..ఇందులో నిజం నూటికి నూరు శాతమని ఇట్టే చెప్పేస్తారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 10:33 AM IST
ఈ ఫ్లైట్ లో ఉన్నోళ్లంతా మహా సుడిగాళ్లు.. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది
X

విమానం ఎక్కటం మాత్రమే మీ చేతుల్లో ఉంది. దిగటం మాత్రం మీ అదృష్టం చేతుల్లోనే. ఇటీవల చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాల నేపథ్యంలో పలువురు ఈ తరహాలో వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. తాజా ఉదంతం గురించి తెలిస్తే..ఇందులో నిజం నూటికి నూరు శాతమని ఇట్టే చెప్పేస్తారు. టేకాఫ్ అయిన విమానం కాసేపటికే మంటలు అంటుకోవటం.. ఆ వెంటనే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి 159 మందిని సేవ్ చేసిన ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది.

త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదం అందరిని గట్టిగా ఊపిరి పీల్చుకునేలా చేసింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈవిమానం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం లాస్ వెగాస్ హ్యారీ రెయిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయ్యింది. నార్త్ కరోలీనా షార్లెట్ లోని డగ్లస్ ఎయిర్ పోర్టుకు చేరాల్సిన ఈ ఎయిర్ బస్ కు చెందిన ఏ321 ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు అంటుకున్న విషయాన్ని గుర్తించారు. ఈ విమానంలో 153 మంది ప్రయాణికులు.. ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

టేకాఫ్ అయిన పది నిమిషాలకే విమానం ఇంజిన్ కింది భాగంలో మంటలు.. పొగను గుర్తించారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ చాకచక్యంతో విమానానని తిరిగి లాస్ వెగాస్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ చేశారు. అనంతరం విమానాన్ని పరిశీలించిన సిబ్బందికి విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం మాత్రమే కాదు.. ఎలాంటి మంటలు అంటుకున్న జాడ కూడా కనిపించలేదని పేర్కొన్నారు.

అయినప్పటికీ సదరు విమానాన్ని రద్దు చేసి.. మరో విమానంలో ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చారు. ఆకాశంలో విమానానికి మంటలు అంటుకున్న వైనాన్ని కొందరు వీడియో తీశారు.కానీ.. గ్రౌండ్ కు చేరుకున్న తర్వాత మాత్రం మంటల ఆనవాళ్లు లేకపోవటంపై ఫెడరల్ ఏవియేషన్ ఆడ్మినిస్ట్రేషన్ సిబ్బంది దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిరిండియా విమాన ప్రమాదం గురించి తలుచుకుంటున్నారు.