Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యంలో ఉద్యోగాల ఊచకోత ఇంత భారీనా?

గడిచిన రోజులే గొప్పగా ఉంటాయన్న మాట పలువురి నోట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఈ మాటలో నిజం ఉందన్న భావన కలుగుతుంది

By:  Tupaki Desk   |   24 Jan 2024 6:41 AM GMT
అగ్రరాజ్యంలో ఉద్యోగాల ఊచకోత ఇంత భారీనా?
X

గడిచిన రోజులే గొప్పగా ఉంటాయన్న మాట పలువురి నోట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఈ మాటలో నిజం ఉందన్న భావన కలుగుతుంది. తాజాగా వెల్లడైన వివరాల్ని చూస్తే.. అగ్రరాజ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఊచకోతను తలపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా గణాంకాలు చెబుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మిగిలిన ఉద్యోగాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. 2002తో పోలిస్తే 2023లో అమెరికాలో ఉద్యోగాల కోత 98 శాతం పెరిగినట్లుగా చెప్పాలి.

ద్రవ్యోల్బణం.. ఫెడరల్ వడ్డీ రేట్ల పెంపు పరిస్థితుల్లో మార్పు లేని నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఉద్యోగాల ఊచకోత కొనసాగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని అమెరికాలోని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ చాలెంజర్.. గ్రే అండ్ క్రిస్మస్ ఒక రిపోర్టులో వార్నింగ్ ఇచ్చింది. 2022లో అమెరికా కంపెనీలు 3.63 లక్షల మంది ఉద్యోగుల్ని తొలగించగా.. 2023లో ఆ సంఖ్య 7.21 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. గత ఏడాది ఉద్యోగాలు కోల్పోయిన 7 లక్షల మందిలో 1.68 లక్షల మంది అమెజాన్.. గూగుల్.. మెటా వంటి దిగ్గజ సంస్థలకు చెందిన వారే కావటం గమనార్హం. 2022తో పోలిస్తే 2023లో ఈ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోవటం 73 శాతంగా ఉంది.

2023లో అమెజాన్ 16 వేలకు పైనే.. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ 12 వేల మందిని.. మైక్రోసాఫ్ట్ 11 వేల మందికి పైగా.. మెటా 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. మరో కీలక అంశం ఏమంటే.. 22 ఏళ్ల తర్వాత ఒకే ఏడాదిలో 1.6 లక్షల మంది ఉద్యోగుల్ని అమెరికా టెక్ కంపెనీలు తీసేయటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. రిటైల్ రంగంలోనూ గత ఏడాది 78,840 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2022తో పోలిస్తే ఇది 274 శాతం అధికమని చెప్పాలి. కృత్రిమ మేధ ఎఫెక్టు కూడా కోతలకు కారణంగా చెబుతున్నారు.

ఉద్యోగ వీసాలపై అమెరికాకు వెళ్లిన వారు సైతం పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్నారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం 2022 నవంబరునుంచి 2023 జనవరి నడుమ అమెరికాలో 2 లక్షల మంది ఉద్యోగులపై వేటు పడగా.. అందులో 80 వేల మంది భారతీయ ఐటీ ఉద్యోగులు ఉన్నట్లుగా చెబుతున్నారు. భారత్ లోనూ టెక్ కంపెనీలు 2022లో 30 వేల మందిని.. 2023లో 28 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. మొత్తంగా అగ్రరాజ్యంలో ఉద్యోగాల కోతల విషయంలో ముందున్న అంశం ఆందోళనకు గురి చేస్తోంది.