హమ్మయ్య..! యుద్ధం ముగిసింది? ఇరాన్-అమెరికా మధ్య రాజీ
యావత్ ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లేనన్న సంకేతాలు వస్తున్నాయి.
By: Tupaki Political Desk | 23 May 2026 1:25 PM ISTయావత్ ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా-ఇరాన్ యుద్ధం ముగిసినట్లేనన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రపంచాన్ని సంక్షోభం అంచులకు తీసుకువెళ్లిన యుద్ధానికి పుల్ స్టాప్ పెట్టాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నట్లు వస్తున్న కథనాలు ఊరటనిస్తున్నాయని అంటున్నారు. సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై రెండు దేశాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు.
కానీ, యుద్ధం ముగిసిందన వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. యుద్ధంపై అమెరికా, ఇరాన్ నుంచి ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకాలం యుద్దం కొనసాగడానికి కారణమైన ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలపై ఎటువంటి ప్రస్తావన లేకుండానే శాంతి ఒప్పందం కుదిరిందన్న ప్రచారం జరుగుతోంది. ఇక యుద్ధంపై ఇరుదేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయన్న ప్రచారంతో చర్చలకు మధ్యవర్తత్వం వహిస్తున్న పాకిస్థాన్ కూడా హడావుడి చేస్తోంది. పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ శుక్రవారం రాత్రి హుటాహుటిన ఇరాన్ రాజధాని టెహ్రాన్ చేరుకున్నారని చెబుతున్నారు. మరోపైపు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ కొద్దిరోజులుగా ఇరాన్ లోనే ఉంటూ పరిస్థితి సమీక్షిస్తున్నారని అంటున్నారు.
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణలతో ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇరాన్ కూడా ఎదురుదాడులకు దిగడంతో పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. అంతేకాకుండా చమురు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడి ప్రపంచం సంక్షోభంలోకి జారిపోయిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల ఒత్తిడితో ఏప్రిల్ 8న అమెరికా కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. అప్పటి నుంచి పాక్ మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
కాగా, ఇరుదేశాల మధ్య ఏయే అంశాలపై శాంతి ఒప్పందం కుదిరిందన్న విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా ఇరుదేశాలు ఒకరిపై ఒకరు మిలటరీ స్థావరాలు, పౌర ఆవాసాలపై దాడులు చేసుకోకూడదన్న అంశమై ఏకాభిప్రాయం కుదిరినట్లు చెబుతున్నారు. అదేవిధంగా ఆర్థిక, మౌలిక వసతులపైనా దాడులు చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయడం, మీడియా దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయడం, ఇదుదేశాలు తమ సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించడం, అంతర్గత సమగ్రతను గౌరవించడం, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు స్వచ్ఛాయుత నౌకా రవాణాకు హామీ ఇవ్వడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై వారం రోజుల్లో చర్చించుకునేలా తుది ముసాయిదా తయారైందని అంటున్నారు. కాగా, ఈ అంశాలపై ఇరాన్ ఏ మేరకు కట్టుబడి ఉందన్న అంశాలపై దశలవారీగా ఆంక్షలు సడలిస్తామని అమెరికా చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.
